రాష్ట్రంలో కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరపి లేకుండా దంచికొడుతున్నాయి. శనివారం రాత్రి నుంచి అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో సోమవారం రెడ్ అలెర్ట్ ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మంగళ, బుధవారాల్లోనూ విస్తారంగా వర్షాలు పడొచ్చని వెల్లడించింది. దీనిపై సర్కారును అప్రమత్తం చేసినట్లు చెప్పింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే చాన్స్ ఉందని, రోడ్డు రవాణా, విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగవచ్చని తెలిపింది.
41 ప్రాంతాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో 2 చోట్ల అతి భారీ, 41 ప్రాంతాల్లో భారీ, 247 చోట్ల మోస్తరు, 381 ప్రదేశాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని చెన్నరావుపేటలో 14 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 12, నేరెళ్లలో 11, వరంగల్ అర్బన్‌లోని కాజీపేటలో 11, నిజామాబాద్‌లోని చిన్న మావంధి, కల్దుర్కి, వరంగల్ రూరల్‌లోని లక్నెపల్లి, మంగళవారిపేట, వరంగల్ అర్బన్‌లోని పైడిపల్లిలో 10 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
ఎల్లంపల్లికి 35 వేల క్యూసెక్కులు
ఆదివారం సాయంత్రానికి ఎల్లంపల్లి రిజర్వాయర్‌కు 35 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం గేట్లు ఎత్తే అవకాశముంది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా, ఇప్పటికే 16.58 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. గేట్లు ఎత్తితే కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసిన నీటిని మళ్లీ సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీజన్‌లోనే తొలిసారిగా ప్రాణహితలో భారీ ప్రవాహం వస్తోంది. మేడిగడ్డకు 1.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 24 గేట్లు ఎత్తి అంతే నీటిని నదిలోకి వదులుతున్నారు. మేడిగడ్డ నుంచి వరద పెద్ద ఎత్తున వస్తుండటంతో ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
జిల్లాల్లో ఇలా..
- భారీ వర్షాల కారణంగా వరంగల్‌లోని 30 కాలనీలు నీటమునిగాయి. ఖానాపురం మండలం బుధరావుపేట సమీపంలో హైలెవల్ బ్రిడ్జి సైడ్ డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో నర్సంపేట–గూడూరు రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. పాకాల చెరువు నిండింది.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ సహా పలు పట్టణాలు జలమయమయ్యాయి. చిలుకవాగు పొంగిపొర్లి హుజూరాబాద్, కనుకులగిద్ద మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. చిగురుమామిడి మండలంలోని సీఎం దత్తత గ్రామం చిన్న ముల్కనూరు బస్టాండ్ ఏరియాలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ సండ్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు తెగి, లక్ష్మీపూర్ గ్రామానికి రాకపోకలు నిలిచాయి.
- నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టు నిండింది. 34 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 29 వేల క్యూసెక్కులు గోదావరిలోకి వదులుతున్నారు.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద పెరగడంతో గేట్లు ఎత్తి దిగువకు సుమారు 3 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలంలోకి వదులుతున్నారు. నాగర్ కర్నూల్ బస్ డిపో వద్ద వర్షానికి రోడ్డు కుంగిపోగా, డిపోలో నుంచి బయటికి వస్తున్న బస్సులు అందులో దిగబడిపోయాయి.
- యాదాద్రి, సూర్యాపేటలో ఆదివారం భారీ వర్షాలు పడ్డాయి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. యాదగిరికొండపైన ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో దర్శనం కోసం వచ్చిన భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు.
- నిజామాబాద్జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలో సుభాష్ నగర్, న్యూఎన్జీవోస్ కాలనీ, ఆదర్శనగర్ కాలనీ వైపు రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
- కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం గుడి తండా వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి.
- ఖమ్మం జిల్లా చంద్రుగొండ మండలంలో పలు గ్రామల్లో ఇండ్లలోకి వరద నీరు చేరింది.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓపెన్ కాస్టు గనుల్లో 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. కిన్నెరసాని, తాలిపేరు రిజర్వాయర్లలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. కిన్నెరసాని కెపాసిటీ 407 అడుగులకుగాను ప్రస్తుతం 399.30 అడుగులకు, తాలిపేరు కెపాసిటీ 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 71.78 మీటర్లకు నీళ్లు చేరాయి.
ముగ్గురు మృతి
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల సమీపంలో లోలెవల్ కల్వర్టుపై నుంచి వాగులో పడి గడ్డం అనీల్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. గురిజాల నుంచి నర్సంపేటకు వస్తూ వాగును దాటే క్రమంలో కొట్టుకుపోయాడు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుమారిలో పిల్లవాగును దాటే క్రమంలో గుండం స్వామి అనే వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. బోథ్ మండలం కుచులాపూర్‌కు చెందిన గుండం స్వామి.. బైక్‌పై వాగును దాటుతుండగా పడిపోయాడు. గాలించగా చెట్ల మధ్యలో ఇరుక్కుపోయిన అతడి డెడ్‌బాడీ కనిపించింది. సంగారెడ్డి జిల్లా కల్హేర్ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా గంగవ్వ (55) పిడుగుపాటుతో మృతి చెందింది. ఉరుములతో కూడిన వర్షం పడటంతో చెట్టు కిందకు వెళ్లగా, చెట్టుపై పిడుగు పడి ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
