ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకారంలో దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై సరస్వతి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి దుర్గమ్మ నామస్మరణతో  మారుమోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు సరస్వతి దేవీ దర్శనం ప్రారంభమైంది. జగన్మాత దుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌ జ‌న్మ న‌క్ష‌త్రం మూలా న‌క్ష‌త్రం కావ‌డంతో దుర్గ‌గుడికి భక్తులు పోటెత్తారు. వినాయకుడు గుడి వద్ద నుంచి క్యూ లైన్ ద్వారా భక్తులను దర్శనానికి పంపిస్తున్నారు అధికారులు. బంగారు వీణ‌తో భ‌క్తుల‌కు చ‌దువుల త‌ల్లిగా సాక్షాత్కారిస్తోంది దుర్గమ్మ. త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముద్ర‌తో స‌ర‌స్వ‌తీదేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తోంది. ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తున్నారు.

పెరిగిన వీవీఐపీల తాకిడి

దసరా ఉత్సవాలలో కీలకమైన మూలా నక్షత్రం రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి వీవీఐపీల తాకిడి పెరిగింది. పురపాలకశాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే కారుమూరి రాజా తదితరులు సరస్వతి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.