కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు
  • తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు 
  • ఈ నెలఖారుకు డీపీఆర్ పూర్తి.. తొలి దశలో టైర్1 ప్రాంతాల్లో పనులు
  • కేబినేట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రులు

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని కేబినేట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ బ్రాండ్ మార్మోగేలా, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. మంగళవారం సెక్రటేరియెట్‌‌‌‌లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన నిర్వహించిన కమిటీ తొలి సమావేశంలో సభ్యులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పుష్కర నిర్వహణ తేదీలు, సంబంధిత శాఖల సన్నద్ధత, భవిష్యత్తు కార్యాచరణను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సరస్వతీ పుష్కరాలు, సమ్మక్క-సారక్క జాతరను అత్యంత వైభవంగా నిర్వహించిందన్నారు. అదేస్ఫూర్తితో రాబోయే గోదావరి పుష్కరాలనూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జులై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహించాలని వేదపండితులు నిర్ణయించారని తెలిపారు. సుమారు 8 కోట్ల మంది భక్తులు ఈ పుష్కరాలకు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగానే గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ 96 ప్రాంతాలను పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేశామని వెల్లడించారు. 

వేగంగా పనుల పూర్తికి చర్యలు..

గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయా చోట్ల క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఘాట్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర, జిల్లా ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని కేబినెట్‌‌‌‌ సబ్‌‌‌‌ కమిటీ సభ్యులు వెల్లడించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనంత వేగంగా పనుల్ని ప్రారంభించేలా ముమ్మర కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఈ నెల చివరి నాటికి డీపీఆర్‌‌‌‌‌‌‌‌లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తొలిదశలో భాగంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రద్దీ అధికంగా ఉండే 9 ప్రాంతాలను టైర్–1 కింద ఎంపిక చేశామన్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్, శాఖలవారీగా నోడల్ అధికారులను నియమిస్తామని చెప్పారు.