ముంబై: రెండు రోజుల భారీ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభపడ్డాయి. చమురు ధరలు భారీగా తగ్గడం, ప్రపంచ దేశాల మార్కెట్లలో సానుకూల పవనాలు వీయడం దీనికి ప్రధాన కారణం. యుద్ధం త్వరలోనే ముగియవచ్చన్న సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. దీంతో సెన్సెక్స్ 639.82 పాయింట్లు పెరిగి 78, 205.98 వద్ద నిలిచింది. ఒక దశలో 960 పాయింట్ల వరకు లాభపడి 78 ,526.25 స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 233.55 పాయింట్లు (0.97) శాతం ఎగబాకి 24 ,261.60 వద్ద స్థిరపడింది. చమురు ధర 9.03 శాతం క్షీణించి 90.26 డాలర్లకు పడిపోయింది. యుద్ధం ముగింపుపై ట్రంప్చేసిన వ్యాఖ్యలు ఆందోళనలను తగ్గించాయి. ఇది గ్లోబల్ మార్కెట్లలో రిస్క్ సెంటిమెంట్ స్థిరపడటానికి దోహదపడింది. సెన్సెక్స్ 30 కంపెనీల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు టాప్ గేనర్లుగా నిలిచాయి. ఇన్ఫోసిస్, రిలయన్స్ , ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.91 శాతం, మిడ్ క్యాప్ 1.71 శాతం లాభపడ్డాయి. మార్కెట్లు మునుపటి సెషన్ నష్టాలను కొంతవరకు భర్తీ చేశాయి. ఎఫ్ఐఐలు సోమవారం రూ.6 ,345.57 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.9 ,013.80 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.
కోలుకున్న రూపాయి
ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలతో రూపాయి కోలుకుంది. ఇది మంగళవారం 36 పైసలు పెరిగి 91.85 వద్ద ముగిసింది. సోమవారం 92.21 వద్ద ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోయిన రూపాయి దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల వల్ల బలపడింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడటం చమురు ధరలు పతనం కావడం మన కరెన్సీకి కలసి వచ్చింది.
తగ్గిన ట్రెజరీ ఈల్డ్స్
అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ మంగళవారం ట్రేడింగ్‌లో గణనీయంగా తగ్గాయి. యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలు బాండ్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. రెండేళ్ల బాండ్ ఈల్డ్ 3.548 శాతానికి పడిపోయింది. పదేళ్ల బెంచ్ మార్క్ బాండ్ ఈల్డ్ 4.119 శాతం వద్దకు చేరింది. గత వారం పెరిగిన ఆందోళనల నుంచి బాండ్ మార్కెట్లు ఇప్పుడు కోలుకుంటున్నాయి.
ఇతర దేశాల మార్కెట్లు కూడా..
ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల బాట పట్టాయి. జపాన్ నిక్కీ మూడు శా తం, హాంకాంగ్ హాంగ్ సెంగ్ రెండు శాతం మేర పెరిగాయి. దక్షిణ కొరియా కోస్పీ సూచీ ఏకంగా ఐదు శాతం లాభపడింది. యూరప్ మార్కెట్లు కూడా రెండు శాతం పైగా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. అమెరికా మార్కెట్లు సోమవారమే సానుకూలంగా ముగియడం గ్లోబల్ మార్కెట్లకు బలాన్నిచ్చింది.
ట్రంప్ కామెంట్స్‌తో ఖుషీ
ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ సీబీఎస్ న్యూస్‌కు తెలిపారు. తన అంచనా కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చమురు ధరలను తగ్గించడానికి కొన్ని దేశాలపై ఆంక్షలు తొలగిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధం మళ్లీ మొదలైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ఉత్సాహాన్ని పెంచాయి.
