న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో ఓడినా రెండో పోరులో మాత్రం నెదర్లాండ్స్ ఆకట్టుకుంది. బాస్ డి లీడె (48 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72 నాటౌట్, 2/20) ఆల్‌రౌండ్ షో చూపెట్టడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 7 వికెట్ల తేడాతో నమీబియాపై గెలిచింది. టాస్ ఓడిన నమీబియా 20 ఓవర్లలో 156/8 స్కోరు చేసింది.
జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్ (42), జాన్ ఫ్రిలింక్ (30), జేజే స్మిత్ (22), గెరార్డ్ ఎరాస్మస్ (18) మెరుగ్గా ఆడారు. లారెన్ స్టీన్‌క్యాంప్ (6), జానె గ్రీన్ (9), రూబెన్ (9), డైలాన్ లీచెర్ (6 నాటౌట్), విలియమ్ మైబర్గ్ (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. లోగాన్ వాన్ బీక్ 2, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ చెరో వికెట్ తీశారు. తర్వాత నెదర్లాండ్స్ 18 ఓవర్లలో 159/3 స్కోరు చేసి నెగ్గింది.
మ్యాక్స్ ఓ డౌడ్ (7) నిరాశపర్చినా.. బాస్ డి లీడె కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మైకేల్ లెవిట్ (28)తో రెండో వికెట్‌కు 30, కొలిన్ అకెర్‌మన్ (32)తో మూడో వికెట్‌కు 72, స్కాట్ ఎడ్వర్డ్స్ (18 నాటౌట్)తో నాలుగో వికెట్‌కు 43 రన్స్ జోడించాడు. బెర్నార్డ్, రూబెన్, జాన్ నికోల్ తలా ఓ వికెట్ పడగొట్టారు. బాస్ డి లీడెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
