- ఇంటి పన్ను ముందే చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ ఇస్తున్న ప్రభుత్వం
- 45.26 శాతంతో టాప్‌లో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ
- హుజూరాబాద్, జమ్మికుంట, రామగుండం బల్దియాల్లో 40 శాతం..
- ఏప్రిల్ 30తో ముగియనున్న స్కీమ్ గడువు
కరీంనగర్, వెలుగు :
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్‌ను ముందే చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీమ్‌కు రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీల్లో మంచి స్పందన లభిస్తుండగా.. మరికొన్నింటిలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కలిపి 10 శాతం ట్యాక్స్ వసూళ్లు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మొహినాబాద్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, జమ్మికుంట, సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలతో పాటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు ట్యాక్స్ వసూళ్లలో ముందంజలో ఉన్నాయి. మున్సిపల్ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుండడంతో బల్దియావాసులు ఆస్తి పన్ను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు.
- విస్తృత ప్రచారం.. అదనపు కౌంటర్లు
2025--– 26 ఆర్థిక సంవత్సరంలో వన్ టైం సెటిల్‌మెంట్ స్కీమ్ బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ పథకాన్ని కేవలం జీహెచ్‌ఎంసీకే పరిమితం చేశారు. దీంతో ఎర్లీ బర్డ్ స్కీమ్‌ను ఈ సంవత్సరం వర్తింపజేస్తారో లేదోనన్న అనుమానాలు తలెత్తాయి. వడ్డీ మాఫీ ఇవ్వకపోవడంతో ఆస్తి పన్నుల వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏప్రిల్1 నుంచి 30వ తేదీ వరకు ఎర్లీబర్డ్ స్కీమ్‌ను వర్తింపజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ స్కీమ్‌పై విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఆస్తి పన్ను పెద్ద మొత్తంలో వసూలు అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించింది. దీంతో అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు. మరో వైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతుండడంతో ట్యాక్స్ చెల్లించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు.
- మొత్తం ట్యాక్స్ రూ. 1,669 కోట్లు.. వసూలైంది రూ.174 కోట్లు
రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ మినహా మిగతా 131 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 1,669.30 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా.. ఈ నెల 27 వరకు 174 కోట్లు (10.50 శాతం) వసూలైంది. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీలో రూ.6.23 కోట్లకుగానూ 26 రోజుల్లో రూ.2.82 కోట్లు (45.26 శాతం) వసూలు అయ్యాయి.
ఆ తర్వాత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.19.25 కోట్లకుగానూ 7.50 కోట్లు (39 శాతం), కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో రూ.3.64 కోట్లకుగానూ రూ.1.36 కోట్లు (38 శాతం), సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో రూ.7 కోట్లకుగానూ రూ. 2.60 కోట్లు (37 శాతం), హుజూరాబాద్ మున్సిపాలిటీలో రూ.3.08 కోట్లకు రూ.కోటి(32 శాతం) వసూలయ్యాయి. మరో 10 మున్సిపాలిటీల్లో 20 శాతం ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాగా.. రాష్ట్రంలోని సగం మున్సిపాలిటీల్లో వసూళ్లు 10 శాతంలోపే ఉన్నాయి.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 16 శాతం, మహబూబ్‌నగర్‌లో 13 శాతం, ఖమ్మం కార్పొరేషన్‌లో 11.50 శాతం ట్యాక్స్ వసూలు అయింది. భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా కోహిర్, సదాశివపేట, కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నల్గొండ జిల్లా నకిరేకల్ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, నిజామాబాద్ జిల్లా బోధన్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలు ట్యాక్స్ వసూళ్లలో వెనుకబడ్డాయి. ఈ మున్సిపాలిటీల్లో నాలుగు శాతంలోపే ట్యాక్స్ వసూలైంది. కాగా, ఎర్లీ బర్డ్ స్కీమ్ గడువు ఈ నెల 30తో ముగియనుంది.

