మంగపేట/ ఏటూరునాగారం/ వెంకటాపురం, వెలుగు: గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ముందస్తు ప్రణాళికలు, వరద నిర్వహణ చర్యల వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొన్నారు. శనివారం మంత్రి సీతక్క ములుగు కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి మంగపేట, ఏటూరునాగారం, వాజేడు మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించి, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. మంగపేట మండలంలోని గంపోనిగూడెంలో జరుగుతున్న కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి, పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
అనంతరం జడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, గోదావరి బ్యాక్‌వాటర్ ప్రభావంతో తరలించిన 28 కుటుంబాలకు చెందిన 112 మంది బాధితులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. వారికి దుప్పట్లు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగుతున్నప్పటికీ కలెక్టర్, ఎస్పీ, సాగునీటి శాఖ, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. రెండేండ్లుగా ప్రత్యేక వరద నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి ముంపు గ్రామాలపై నిరంతర నిఘా ఉంచడం వల్లే నష్టాలను నివారించగలిగామని చెప్పారు. 2022, 2023 వరదల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రామన్నగూడెం, మంగపేట ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని, ఇప్పటికే సుమారు 800 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను గుర్తించి రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. వాగులు, నదుల ఒడ్డున ఇళ్ల నిర్మాణం ప్రమాదకరమని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం వాజేడు మండలంలోని హోసూరు గోదావరి వంతెన వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. వాజేడు, వెంకటాపురం మండలాల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చీకుపల్లి–పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుకవాగుపై దెబ్బతిన్న డైవర్షన్ రోడ్డును పరిశీలించి పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. దూలాపురంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. మంత్రి వెంట ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీవో కృష్ణవేణి, డీపీవో వెంకయ్యపాల్గొన్నారు.
