స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
  •     ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పీఆర్ కు ఈసీ లేఖ
  •     బ్యాలెట్ పేపర్లు, బాక్స్ లు సమకూర్చుకోవాలని ఆదేశం 
  •     ఇప్పటికే ముగిసిన సర్పంచ్​ల టర్మ్
  •     జులైలో ముగియనున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్

హైదరాబాద్, వెలుగు : లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల టర్మ్ ముగియగా, జులైలో ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్ కూడా అయిపోనుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రక్రియ ప్రారంభించింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లు, బ్యాలెట్ పేపర్లు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి సమకూర్చుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రాంచంద్రన్​కు రాష్ర్ట ఎన్నికల సంఘం సెక్రటరీ అశోక్ కుమార్ లేఖ రాశారు. 

బ్యాలెట్ బాక్స్ ల పేపర్ సీల్స్(1.80 లక్షలు), పేపర్ ట్యాగ్స్ (1.80 లక్షలు) ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లీష్​లో ఉండేలా వచ్చే నెల 15వ తేదీ కల్లా సమీకరించాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 563 జడ్పీటీసీలు ఉండగా అదే సంఖ్యలో ఎంపీపీలు ఉన్నారు. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ర్ట వ్యాప్తంగా 36,139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సెక్రటరీ స్పష్టం చేశారు. వీటికి అదనంగా మరో10 శాతం పోలింగ్ స్టేషన్ల అవసరం ఉంటుందని, అందుకు రెడీగా ఉండాలన్నారు.  

ఈ ఏడాది చివరికల్లా అన్ని ఎన్నికలు.. 

ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతల మీటింగ్ లో ప్రకటించారు. జూన్ 5 తర్వాత ఎంపీ ఎన్నికల కోడ్ ముగిశాక ఈ ప్రాసెస్ మరింత స్పీడప్ కానుంది. గత 3 నెలల నుంచి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో సర్పంచ్ ల టర్మ్ ముగియగా, జులై 3న ఎంపీటీసీల టర్మ్, జులై 5న ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్ అయిపోనుంది. 

త్వరలో మున్సిపల్, జీహెచ్ఎంసీ టర్మ్ కూడా ముగియనుంది. ఈ ఏడాది చివరికల్లా అన్ని ఎన్నికలు పూర్తి చేస్తే.. వచ్చే 4 ఏండ్లు పూర్తిగా పాలనపై దృష్టి పెట్టి స్కీమ్ లు అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని సీఎం యోచిస్తున్నారు. ఎన్నికల కోడ్ వల్ల పాలనకు బ్రేక్ పడటంతో స్కీమ్ ల అమలుకు అడ్డంకులు ఏర్పడుతున్నందున ముందుగా ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.