ప్రగతి భవన్​లో బీఫాంలు ఇస్తే..అధికారులకు నోటీసులు ఎట్లిస్తరు?

ప్రగతి భవన్​లో బీఫాంలు ఇస్తే..అధికారులకు నోటీసులు ఎట్లిస్తరు?

హైదరాబాద్, వెలుగు: ప్రగతి భవన్​లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫాంలు ఇస్తే.. సంబంధిత వ్యక్తులకు కాకుండా ప్రగతి భవన్​ నిర్వహణ అధికారులకు నోటీసులు ఎలా ఇస్తారని రాష్ట్ర ఎన్నికల అధికారులపై ఎలక్షన్​ కమిషన్​ సీరియస్​ అయినట్టు తెలిసింది. ప్రగతి భవన్​ సీఎం క్యాంప్​ ఆఫీస్.. ఎన్నికల కోడ్ అమలులో​ఉన్న సమయంలో అక్కడ పొలిటికల్​ యాక్టివిటీస్​కు తావివ్వకూడదు. కానీ, అందులో కొందరు బీఆర్ఎస్​ అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చారని కాంగ్రెస్​  కంప్లయింట్​ చేసింది.

అయితే, ‘బీఆర్ఎస్​ సెక్రటరీ జనరల్ కు గానీ.. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్​​లేదా వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​​కు కాకుండా ప్రగతి భవన్​ నిర్వాహకులకు నోటీసు ఇచ్చి స్పందించాలని కోరడం ఏమిటి? సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రగతి భవన్​లో కార్యక్రమాలు చేస్తుంటే.. నిర్వాహకులకు ఆపే అంత ఉంటుందా?’ అని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను అడిగినట్లు తెలిసింది.

గతంలో ఇలాంటి సందర్భంలోనే పార్టీలో సెకండ్​ ప్లేస్​లో ఉన్న వాళ్లకి నోటీసులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసినట్టు సమాచారం. దీంతో సీఈఓ వికాస్​ రాజ్, జీహెచ్​ఎంసీ ఎలక్షన్​ ఆఫీసర్​ రొనాల్డ్ రాస్​ మళ్లీ నోటీసులు ఇవ్వాలా? లేక ప్రగతి భవన్​ నిర్వహణలో ఉన్న ఆఫీసర్లు ఇచ్చే రిప్లై ఆధారంగా ముందుకు వెళ్లలా.. అనేదానిపై తర్జన భర్జన పడుతున్నారు. ఆఫీసర్లు ఇచ్చే రిప్లై సంతృప్తికరంగా ఉంటే అంతటితో వదిలేయనున్నట్లు తెలిసింది. లేదంటే మళ్లీ బీఆర్​ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్​కు లేదా వర్కింగ్​ ప్రెసిడెంట్​కు నోటీసు పంపి వివరణ తీసుకునే అవకాశం ఉంది.