4 రాష్ట్రాలు, ఒక యూటీలో అసెంబ్లీ నగారా..ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈసీ

4 రాష్ట్రాలు, ఒక యూటీలో అసెంబ్లీ నగారా..ఎన్నికల షెడ్యూల్ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈసీ
  • కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 9న పోలింగ్​ 
  • తమిళనాడులో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 23, బెంగాల్​లో 23,29న నిర్వహణ
  • అన్నిచోట్ల మే 4న ఓట్ల కౌంటింగ్.. రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌
  • ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి
  • వివరాలు వెల్లండించిన సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: దేశంలో మినీ ఎన్నికల సంగ్రామానికి తెరలేచింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తమిళనాడు (234), బెంగాల్‌‌‌‌‌‌‌‌ (294), కేరళం (140), అస్సాం (126) రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (30) లో  మొత్తంగా 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌‌‌‌‌‌‌ (సీఈసీ) జ్ఞానేశ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కమిషనర్లు సుఖ్‌‌‌‌‌‌‌‌బీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ సంధూ, వివేక్‌‌‌‌‌‌‌‌ జోషీ వివరాలు వెల్లడించారు. ఈ ఎన్నికలు ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 29 మధ్య జరగనున్నాయి. కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్​ 23న ఒకే ఫేజ్‌‌‌‌‌‌‌‌లో ఎన్నికలు ఉంటాయి. 

అత్యధిక స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌‌‌‌లో  రెండు దశల్లో  ఏప్రిల్ 23, ఏప్రిల్ 29న పోలింగ్​ ఉంటుంది.  అన్ని రాష్ట్రాల్లో మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌‌‌‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది.

ఓటర్ల మహా కుంభమేళా

ఐదు చోట్ల మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనబోతున్నారని సీఈసీ జ్ఞానేశ్‌‌‌‌కుమార్​ తెలిపారు. బెంగాల్‌‌‌‌లో అత్యధికంగా 6.44 కోట్ల మంది, తమిళనాడులో 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. 2.19 లక్షల పోలింగ్‌‌‌‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా..25 లక్షల మంది ఎన్నికల అధికారులు ఈ పోలింగ్​ ప్రక్రియలో పాల్గొంటున్నారని వివరించారు. ‘‘యువ ఓటర్లదే కీలక పాత్ర. మీ ఓటుతో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించండి. గర్వంగా, బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోండి” అని ఆయన పిలుపునిచ్చారు. పారదర్శకమైన, హింసలేని ఎన్నికల నిర్వహణే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

రంగంలో హేమాహేమీలు

బెంగాల్‌‌‌‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ) వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. మరోవైపు, టీఎంసీని గద్దె దించాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉన్నది. ఈ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్.. బీజేపీ–అన్నాడీఎంకే కూటమితో తలపడనున్నది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా రెండు కూటములు సిద్ధమవుతున్నాయి. 

కేరళంలో మొత్తం 140 స్థానాల కోసం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్‌‌‌‌), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్‌‌‌‌) మధ్య ప్రధాన పోటీ నెలకొన్నది. ఈ రెండు కూటములను ఢీకొనేందుకు ఎన్డీయే (ఎన్డీయే) కూడా సిద్ధమైంది. కేరళలో బీజేపీ సుమారు 100 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తుండగా, మిగిలిన 40 స్థానాల్లో కూటమిలో భాగంగా ఉన్న భారత్ ధర్మ జనసేన (బీడీజేఎస్‌‌‌‌), 'ట్వంటీ-20' పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వానికి,  కాంగ్రెస్ పార్టీకి మధ్య ప్రధాన పోరు జరగనున్నది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సీఎం ఎన్. రంగసామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్సీ, డీఎంకే–-కాంగ్రెస్ కూటమి మధ్య పోరు సాగనున్నది. 

8 స్థానాల్లో బైపోల్‌‌‌‌

ఆరు రాష్ట్రాల్లోని మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్​ రిలీజ్‌‌‌‌ చేసింది. గోవా, కర్నాటక, నాగాలాండ్‌‌‌‌, త్రిపురలో ఐదు స్థానాలకు ఏప్రిల్‌‌‌‌ 9న, గుజరాత్‌‌‌‌, మహారాష్ట్రల్లోని మూడు అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌‌‌‌ 23న పోలింగ్‌‌‌‌ జరగనున్నది. గోవాలోని ఫోండా, కర్నాటకలోని  బాగల్‌‌‌‌కోట్, దావణగెరె సౌత్, నాగాలాండ్‌‌‌‌లోని  కోరిడాంగ్, త్రిపురలోని ధర్మనగర్, గుజరాత్‌‌‌‌లోని ఉమ్రేత్, మహారాష్ట్రలోని రాహురి, బారామతి స్థానాల్లో సిట్టింగ్‌‌‌‌ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వీటి ఫలితాలు కూడా మే 4న వెల్లడి కానున్నాయి.