- గత ఎలక్షన్స్‌తో పోలిస్తే 40.14 శాతం రికవరీ పెరిగినట్లు వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వెల్లడించింది. ఈ మొత్తం విలువ రూ.1,444. 96 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ఇందులో నగదు రూ.154.89 కోట్లు, మద్యం విలువ రూ.183.33 కోట్లు (69,88,793.38 లీటర్లు), డ్రగ్స్ రూ.337.88 కోట్లు, విలువైన లోహాలు రూ.250.14 కోట్లు, తదితరాలు రూ.518.73 కోట్లు ఉన్నాయని పేర్కొంది.
ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) అనే ఐటీ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించినట్లు తెలిపింది. దీని ద్వారా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపడి సమాచార మార్పిడి వేగవంతమైందని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఈఎస్ఎంఎస్ యాక్టివేట్ చేసినప్పటి నుంచి మే 6 వరకు పట్టుబడిన మొత్తం సొత్తు వివరాలను గురువారం ఒక ప్రకటనలో ఈసీఐ వెల్లడించింది. ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పటిష్టంగా అమలు చేసినట్లు తెలిపింది. అయితే, బెంగాల్‌లోని ఫాల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో మినహా మిగిలిన అన్ని చోట్లా మోడల్ కోడ్ ముగిసినట్లు పేర్కొంది.
తమిళనాడులో దొరికిందే ఎక్కువ...
ఈ 5 రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో పట్టుబడిన సొత్తుతో పోల్చితే తాజా ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న సొమ్ము ఏకంగా 40.14 శాతం పెరిగిందని ఈసీఐ వెల్లడించింది. 2021 సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.1,029.93 కోట్లు రికవరీ చేసినట్లు చెప్పింది. కాగా, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉద్దేశించిన డబ్బులో ఎక్కువ భాగం తమిళనాడులోనే పట్టుబడింది. తమిళనాడులో అత్యధికంగా రూ.662.28 కోట్లు సీజ్ చేయగా.. వెస్ట్ బెంగాల్ రూ.573.41 కోట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉంది. అస్సాంలో రూ.117.24 కోట్లు, కేరళలో రూ.80.67 కోట్లు, పుదుచ్చేరిలో రూ.9.72 కోట్లు పట్టుబడినట్లు ఈసీ వెల్లడించింది.
