అమోయ్‌కుమార్‌‌కు మళ్లీ ఈడీ పిలుపు..మే 25న విచారణకు హాజరుకావాలని ఆదేశం

అమోయ్‌కుమార్‌‌కు మళ్లీ ఈడీ పిలుపు..మే 25న విచారణకు హాజరుకావాలని ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: భూదాన్‌ భూముల అక్రమ బదలాయింపు, మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్‌‌ ఐఏఎస్‌ అమోయోకుమార్‌‌ను మరోసారి విచారించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని సర్వే నంబర్ 181, 182లో గల 42 ఎకరాల 33 గుంటల భూదాన్‌ భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తోంది.

ఈ వ్యవహారంలో స్థానికులు రియల్టర్లతో కలిసి అయోయ్‌కుమార్‌‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఇప్పటికే ఆధారాలు సేకరించింది. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్‌ మల్కాజ్ గిరి జిల్లాలోని భూదాన్‌ భూముల కుంభకోణం కేసులో 2024 అక్టోబర్‌‌ 23, 24, 25 తేదీల్లో అమోయ్‌కుమార్‌‌ను ఈడీ విచారించింది. ఆ మూడు రోజులు దాదాపు 21 గంటల పాటు ప్రశ్నించింది. దానికి కొనసాగింపుగానే భూదాన్‌ భూములకు సంబంధించిన రికార్డులను మరోసారి పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమోయ్‌కుమార్‌‌కు మళ్లీ సమన్లు జారీ చేసింది.