భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది ఈడీ. భూదాన్ భూముల వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టిన ఈడీ గతంలో 2024 లో అమోయ్ కుమార్ ను విచారించింది. తాజాగా ఈ నెల 25న విచారణకు హాజరుకావాలని మళ్ళీ సమన్లు జారీ చేసింది ఈడీ.
ఈసారి మూడు సేల్ డీడ్ వివరాలతో రావాలని అమోయి కమార్ కు సమన్లు జారీ చేసింది ఈడీ. గతంలో మహేశ్వరం పీఎస్ లో నమోదు చేసిన కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తోంది ఈడీ. 42 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్న క్రమంలో విచారణ చేపట్టింది ఈడీ. ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ది పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్యాక్రాంతం చేశారు. విజిలెన్స్ విచారణలో అమోయ్ కుమార్ బాగోతం బయటపడింది. ఇదే వ్యవహారంలో అప్పటి MRO జ్యోతిపై కూడా కేసు నమోదైంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు విచారిస్తే కలెక్టర్ కథలు బయటకు వచ్చాయి. విజిలెన్స్ అధికారులు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నాగారంలోని సర్వే నెంబర్ 181, 182 లోని 102.2 ఎకరాలపై కొంత కాలంగా వివాదం నడుస్తోంది. అందులో 50 ఎకరాల భూమి భూదాన్ బోర్డ్ కి చెందినదని బోర్డ్ వాదిస్తోంది. ఈ భూమి జబ్బార్దస్త్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఆయన కొడుకు హజీఖాన్ 50 ఎకరాల ల్యాండ్ ను భూదాన్ బోర్డ్ కి దానం చేశాడు.
2021లో హజీఖాన్ వారుసురాలిని అంటూ 40 ఎకరాలు తనదేనని ఖాదురున్నీసా దరఖాస్తు చేసుకుంది. క్షేత్ర స్థాయిలో RDO, తహశీల్దార్, ఆన్ఐలు, సీనియర్ అసిస్టెంట్ ఖాదురున్నీసాకు అనుకూలంగా ఉండి.. ఆఘమేఘాల మీద ఆమె పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్మారు. దీంతో ఎన్నికల సమయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయి.
ఈ భూమిపై క్రయవిక్రయాలు చేయకుండా ధరణిలో నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. ఈ వ్యవహారం కోర్ట్ కి చేరడంతో కోర్ట్ ఆదేశాలతో అప్పటి MRO జ్యోతి, జాయింట్ సబ్ రిజిస్టార్, EIPL కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్ కొండపల్లి శ్రీధర్ పై కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లో భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరగడంతో ఈడీ రంగంలోకి దిగిన ఈడీ విచారణ జరుపుతోంది.
