వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్: రూ.9 కోట్ల నోట్ల కట్టలు, బంగారం సీజ్

వైఎస్ రెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్: రూ.9 కోట్ల నోట్ల కట్టలు, బంగారం సీజ్

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్.. ED దాడుల్లో పెద్ద చేప చిక్కింది. ఇంట్లో సోదాలు చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏకంగా 9 కోట్ల రూపాయల నోట్ల కట్టలు గుట్టలుగా ఇంట్లో పట్టుబడ్డాయి. అంతేనా.. మరో 10 కోట్ల రూపాయల విలువైన బంగారం సీజ్ చేశారు అధికారులు. ఇంతకీ ఎవరీ వై.ఎస్.రెడ్డి.. ఇతను ఏం చేస్తుంటాడు.. ఈడీ దాడి వెనక ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం..

హైదరాబాద్‎కు చెందిన వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్‎గా పని చేస్తున్నాడు. అయితే.. బిల్డర్స్‎తో కుమ్మక్కై 41 భవనాలకు ఆయన అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వైఎస్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గురువారం (మే 15) అతడి ఇంట్లో సోదాలు నిర్వహించింది.

ఏకకాలంలో ముంబై, హైదరాబాద్‎తో పాటు 12 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 9 కోట్ల రూపాయలకు పైగా నగదు, 23 కోట్ల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నోట్ల కట్టలు, నగల గుట్టలు చూసి అధికారులు ఆశ్చర్యపోయినట్లు సమాచారం. కోట్ల విలువైన డాక్యుమెంట్లను కూడా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.