ఢిల్లీ మంత్రి కైలాశ్​ను ప్రశ్నించిన ఈడీ

ఢిల్లీ మంత్రి కైలాశ్​ను ప్రశ్నించిన ఈడీ
  •    లిక్కర్ స్కామ్​లో 5 గంటలకు పైగా విచారణ
  •     పాలసీ తయారీపై ప్రశ్నలు.. స్టేట్ మెంట్ రికార్డు   

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ మంత్రి కైలాశ్ గహ్లోత్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. శనివారం ఆయనను 5 గంటల పాటు ప్రశ్నించి, మనీలాండరింగ్ యాక్ట్ కింద స్టేట్ మెంట్ రికార్డు చేసింది. ట్రాన్స్ పోర్ట్, హోమ్, లా మినిస్టర్ గా ఉన్న కైలాశ్.. లిక్కర్ పాలసీ తయారీ కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో ఉన్నారు. తన అధికారిక నివాసాన్ని ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ చార్జ్ విజయ్ నాయర్ ఉండేందుకు ఇచ్చినట్టు కైలాశ్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ ఆయనను విచారించింది. పాలసీ తయారీకి అనుసరించిన విధానంపై ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆప్ మాజీ కమ్యూనికేషన్ ఇన్ చార్జ్ విజయ్ నాయర్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. 

మళ్లీ పిలిచినా వస్తా..

ఈడీ 5 గంటలకు పైగా తనను ప్రశ్నించిందని కైలాశ్ గహ్లోత్ తెలిపారు. ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవేళ ఈడీ మళ్లీ విచారణకు పిలిస్తే వస్తానని చెప్పారు. ‘‘నెల కింద అసెంబ్లీ నడుస్తున్న టైమ్ లో ఈడీ నాకు సమన్లు ఇచ్చింది. అప్పుడు రాలేనని, టైమ్ ఇవ్వాలని కోరాను. ఈడీ మళ్లీ రెండోసారి సమన్లు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యాను. వాళ్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాను. గోవా ఎన్నికల ప్రచారానికి నేను వెళ్లలేదు. అసలు అక్కడేం జరిగిందో నాకు తెలియదు. ప్రభుత్వం నాకు కేటాయించిన బంగ్లాకు నేను షిఫ్ట్ కాలేదు. నా భార్య, పిల్లల కోరిక మేరకు సొంతింట్లోనే ఉన్నాను. నాకు కేటాయించిన బంగ్లాలో విజయ్ నాయర్ ఉండేవాడు’’ అని తెలిపారు.