- పేపర్ లీకేజీలతో స్టూడెంట్ల భవిష్యత్ నాశనం చేశారు
- జెన్‌జీ పోరాటానికి తమ సహకారం ఉంటుందని హామీ
న్యూఢిల్లీ, వెలుగు: ప్రజాస్వామ్య దేశంలో డిక్టేటర్ షిప్ పాలన నడవదని, ప్రధాని మోదీ ప్రభుత్వానికి రోజులు లెక్కపెట్టుకొనే సమయం వచ్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హెచ్చరించారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ దందా చేసి, విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశారని మండిపడ్డారు. ఇందుకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వేదికగా సాగిన ‘ఛలో పార్లమెంట్’ఆందోళనలో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొన్నారన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ పాలన వద్దని, మోదీని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా విద్యార్థులపై మోదీ ప్రభుత్వం లాఠీలు ఝులిపించి, టియర్ గ్యాస్ ప్రయోగించి చేతగానితనాన్ని చాటుకుందని, ఈ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థులు చేస్తున్న పోరాటం, చూపుతున్న ధైర్యానికి ఆయన అభినందనలు తెలిపారు. తమ హక్కులు, భవిష్యత్ కోసం ఒకవైపు యువత పోరా డుతుంటే, నీట్ పేపర్ లీకేజ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అయోధ్య విరాళాల చోరీ, పెట్రోల్‌లో ఇథనాల్ స్కాం, ఇతర అంశాలపై కూడా పోరాడుతామన్నారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..
పిల్లల భవిష్యత్‌ను అమ్ముకొని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేపర్ లీకేజీ చేశారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పార్లమెంట్‌లో చర్చకు పట్టుబడుతుంటే కేంద్రం తప్పించుకుంటోందని ఫైర్ అయ్యారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల వాయిదా పడిన అనంతరం మకర ద్వారం ఎదురుగా మీడియాతో ఆయన మాట్లాడారు. నీట్ ర్యాంకర్లతో ఫొటో షూట్ చేసి ‘ఎక్స్’లో పలువురికి అభినందనలు తెలుపుతున్న ప్రధాన్.. నీట్ పేపర్ లీకేజ్, దీని కారణంగా ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ల గురించి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ప్రశ్నపత్రాల లీకేజీలు జరుగుతున్నాయని నిలదీశారు. నిరసన తెలపడం, అభిప్రాయాలను వెల్లడించడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని ఆయన పేర్కొన్నారు. జై శ్రీరాం తమ నినాదం అని చెప్పుకునే మోదీ, బీజేపీ నేతలు.. అదే అయోధ్య రామ మందిరంలో భక్తులు విశ్వాసంతో సమర్పించుకున్న చందాల చోరీపై స్పందిండకపోవడం హాస్యాస్పందంగా ఉందన్నారు. దాదాపు రూ.250 కోట్ల ఈ స్కామ్‌పై కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మోదీ పిరికివాడైతే.. అమిత్ షా చేతగానివాడు
ప్రధాని మోదీ పిరికివాడైతే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతగాని వాడని విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌తో బహిర్గతమైందని ఎంపీ వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. 20 ఏండ్ల కింద గుజరాత్‌లో మోదీ– అమిత్ షా ద్వయం అరాచకాలు, అల్లర్లు చేశాయని ఆరోపించారు. మళ్లీ 20 ఏండ్ల తర్వాత దేశ యువత (జెన్ జీ)పై అదే తీరులో అరాచకాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విధానాలను కాంగ్రెస్ కచ్చితంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. మన భవిష్యత్ కోసం మనమే పోరాడాలని, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎంపీలుగా తమ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
