నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలు పెట్టాల్సిందే..ప్రైవేటు బడులకు విద్యాశాఖ ఆదేశం 

నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలు పెట్టాల్సిందే..ప్రైవేటు బడులకు విద్యాశాఖ ఆదేశం 
  • ఆదాయ, వ్యయాల లెక్కలు ఆన్‌‌లైన్‌‌ చేయాలి
  • ఈ నెల 30లోపు గత రెండేండ్ల లెక్కలివ్వాలి: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దందాకు చెక్ పెట్టేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ క్లాస్‌‌కు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో తెలిసేలా పూర్తి వివరాలను ప్రతి స్కూల్​తన నోటీసు బోర్డులతో పాటు వెబ్‌‌సైట్లలో కచ్చితంగా ప్రదర్శించాలని తేల్చి చెప్పింది. 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలు తల్లిదండ్రులకు తెలిసేలా బహిర్గతం చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఆదేశాలు జారీచేశారు.

ఫీజుల వివరాలతో పాటు, ప్రైవేటు అన్‌‌-ఎయిడెడ్ స్కూళ్లన్నీ తమ ఆదాయ వ్యయాల లెక్కలనూ ప్రభుత్వానికి చెప్పాలని స్పష్టం చేశారు. 2023–-24, 2024 –-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలన నివేదికలతో పాటు ఆడిట్ చేసిన స్టేట్‌‌మెంట్లను సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ రిపోర్టులను తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ తో తనిఖీ చేయించి, వారు ధ్రువీకరించిన పత్రాలను ఈ నెల 30వ తేదీలోపు విద్యాశాఖ వెబ్‌‌సైట్ schooledu.telangana.gov.in లో అప్‌‌లోడ్ చేయాలని డెడ్‌‌లైన్ విధించారు.

ఇప్పటివరకు రిపోర్టులు సమర్పించని స్కూళ్లపై కఠినంగా వ్యవహరించాలని డీఈఓలు, ఆర్జేడీలను నవీన్ నికోలస్ ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన యాజమాన్యాలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ప్రభుత్వ రూల్స్ పాటించని స్కూళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, నివేదికలు ఇవ్వని వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.