విద్యారంగానికి బడ్జెట్​లో ప్రాధాన్యం ఇవ్వాలి : అలుగుబెల్లి నర్సిరెడ్డి

విద్యారంగానికి బడ్జెట్​లో ప్రాధాన్యం ఇవ్వాలి :  అలుగుబెల్లి నర్సిరెడ్డి

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని, రానున్న బడ్జెట్​లో అధిక నిధులు కేటాయించాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. అంతరాల్లేని విద్యావ్యవస్థకు అందరూ కృషి చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్​లో టీఎస్ యూటీఎఫ్​ కొత్త సంవత్సర డైరీ, క్యాలెండర్​ను మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో, చదువుల్లో సమానత్వం సాధిస్తేనే సమాజంలో సమానత్వం సాధించడం సాధ్యమవుతోందని చెప్పారు. 

రకరకాల పేర్లతో చదువుల్లో అడ్డుగోడల్లా అంతరాలున్నప్పుడు అందరికీ సమాన విద్య అందించినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కేజీ టు పీజీపై హామీ ఇచ్చినా, విద్యారంగానికి ఆశించిన స్థాయిలో  కేటాయింపులు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం అందరికీ నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించే వైపు చొరవ చూపాలని కోరారు.