వంద గ్రాముల ఈకల ధర సుమారు రూ. 50 వేలు!

వంద గ్రాముల ఈకల ధర సుమారు రూ. 50 వేలు!

నెమలి ఈకలను భద్రంగా దాచుకుంటుంటారు చిన్నపిల్లలు. ఎందుకంటే అవి ఎంతో అందంగా ఉంటూనే, చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి. అయితే అంతకంటే అరుదుగా దొరికే ఈకలు ఇంకొన్ని ఉన్నాయి. అవే ఈడార్ పోలార్ బాతు ఈకలు. ఇవి అరుదుగా లభించడమే కాదు వీటి ధర కూడా చాలా ఎక్కువ. ప్రపంచంలోనే ఖరీదైన ఈకలు ఇవి. ఈడార్ పోలార్ బాతులు కేవలం ఐస్‌‌‌‌లాండ్‌‌‌‌లో మాత్రమే నివసిస్తాయి. మైనస్ డిగ్రీల్లో ఉండే చలికి తట్టుకునేలా వీటి ఈకలు ప్రత్యేకంగా ఫైబర్‌‌‌‌‌‌‌‌తో తయారవుతాయి. అందుకే వీటి ఈకలకు అంత డిమాండ్. ఈ బాతు నుంచి తీసిన వంద గ్రాముల ఈకల ధర సుమారు యాభై వేల రూపాయలు ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన ఫైబర్‌‌‌‌ను ఈ బాతు ఈకలతోనే తయారుచేస్తారు. ఇవి చాలా తేలికగా ఉండడంతో పాటు శరీరానికి ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. ఈ బాతు ఈకలతో ఖరీదైన బ్యాగులు, స్వెటర్లు తయారుచేస్తారు. అయితే ఈ బాతు నుంచి ఈకలు సేకరించడం అంత ఈజీ కాదు. ఇవి ఐస్‌‌‌‌లాండ్‌‌‌‌లోని మారుమూల ప్రాంతాల్లో ఎంతో ఎత్తులో నివసిస్తుంటాయి. ఇవి  గుడ్లు పెట్టి పొదిగేటప్పుడు ఈకలు రాలి కిందపడుతుంటాయి. వాటిని జాగ్రత్తగా సేకరించి దాచిపెట్టుకోవాలి. ఒక్కో బాతు ఏడాదికి మూడుసార్లు పొదుగుతుంది. ఒక కిలో ఈకలను సేకరించాలంటే దాదాపు 60 బాతులు అవసరం.