17 ఎంపీ సీట్లకు..893 మంది నామినేషన్లు!

17 ఎంపీ సీట్లకు..893 మంది నామినేషన్లు!
  • రాష్ట్రంలో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి
  • అత్యధికంగా మల్కాజ్ గిరి స్థానానికి 114 మంది 
  • అత్యల్పంగా ఆదిలాబాద్​లో 23 మంది నామినేషన్​ 
  • ఇయ్యాల స్ర్కూటినీ.. విత్ డ్రాకు 29 వరకు చాన్స్  

హైదరాబాద్, వెలుగు :  లోక్​సభ ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తయింది. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు దాదాపు 890కు పైగా నామినేషన్లు వచ్చాయి. అత్యధికంగా మల్కాజ్ గిరి లోక్​సభ స్థానానికి 114  మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 23 మంది క్యాండిడేట్లు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు ఈ నెల18న నోటిఫికేషన్ వెలువడగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. మొత్తం17 ఎంపీ స్థానాల్లో బుధవారం వరకు 800 మంది పోటీలో నిలవగా

 చివరి రోజైన గురువారం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి.   నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో శుక్రవారం నుంచి స్ర్కూటినీ (పరిశీలన) జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు ఉంది. అలాగే కంటోన్మెంట్‌‌ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ల గడువు ముగిసింది. రాష్ట్రంలోని17 ఎంపీ స్థానాలు, ఒక ఎమ్మెల్యే స్థానానికి మే13న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.  

నియోజకవర్గాల వారీగా ఇలా.. 

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 57 మంది నుంచి 85 సెట్ల నామినేషన్లు, సికింద్రాబాద్ స్థానానికి 57 మంది నుంచి 75 సెట్ల నామినేషన్లు వచ్చాయి. మహబూబాబాద్ స్థానానికి 30 మంది 56 సెట్లు, భువనగిరికి 61 మంది, ఖమ్మం స్థానానికి 45 మంది అభ్యర్థులు నామినేషన్ లు ఫైల్ చేశారు. జహీరాబాద్ స్థానానికి 40 మంది 87 సెట్లు నామినేషన్లు, మెదక్ స్థానంలో 54  మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్​లో 23 మంది 42 నామినేషన్లు, పెద్దపల్లి స్థానానికి 63 మంది109 సెట్ల నామినేషన్లు, వరంగల్ సెగ్మెంట్ కు 58 మంది 89 సెట్ల నామినేషన్లు వేశారు.

మహబూబ్ నగర్ కు 42 మంది 72 సెట్ల నామినేషన్లు, కరీంనగర్ కు 53 మంది 94 సెట్ల నామినేషన్లు, నిజామాబాద్ కు 42 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు, నాగర్ కర్నూల్ కు 34 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు, నల్గొండకు 56 మంది114 సెట్ల నామినేషన్లు వేశారు. చేవెళ్ల నియోజకవర్గానికి 64 మంది అభ్యర్థులు 88 సెట్ల నామినేషన్లు, మల్కాజ్​గిరికి 114 మంది 177 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.