సొంతూళ్లకు పోకుండానే ఓటేయొచ్చు

సొంతూళ్లకు పోకుండానే ఓటేయొచ్చు

స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేందుకు ఇబ్బందులుపడుతున్న వారికి ఎలక్షన్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసీ కొత్తగా డెవలప్ చేసిన రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ఉపయోగించి ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్దమైంది. ఆర్వీఎం ద్వారా ఉపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లకుండానే ఓటు వేసేలా ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. జనవరి 16న రాజకీయ పార్టీలకు డెమో ఇచ్చేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిమోట్ వోటింగ్ మిషన్ డెమోకు హాజరుకావాలని ఆహ్వానం పంపింది. లీగల్, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రిమోట్ ఓటింగ్ సిస్టమ్ అమలుపై ముందుకెళ్లాలని ఈసీ భావిస్తోంది. 

 

దేశంలోని చాలా మంది ఓటు వేసేందుకు సొంత నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ సమస్యలను అధిగమించేందుకు రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ఆలోచన చేసి మెషిన్ ను డెవలప్ చేసింది. ఈ కొత్త ఓటింగ్ మిషన్ తో ఒక పోలింగ్ బూత్ నుంచి 72 వేర్వేరు నియోజకవర్గాలను కవర్ చేసేలా రూపొందించారు. రాజకీయ పార్టీల అంగీకారం తర్వాత ఈ ఇష్యూపై ఈసీ ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. అప్పట్లో దాదాపు 30 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నట్లు ఈసీ గుర్తించింది. వీరంతా బయటి ప్రాంతాల్లో స్థిరపడ్డ వారే అని, వీరు ఓటింగ్ లో పాల్గొనేలా ఈ రిమోట్ ఓటింగ్ మెషిన్ ను అభివృద్ధి చేసింది.