Vada Pav Girl: వడా పావ్ గర్ల్‌ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు

Vada Pav Girl: వడా పావ్ గర్ల్‌ను అరెస్ట్ చేయలేదు..: ఢిల్లీ పోలీసులు

వడా పావ్ వైరల్ గర్ల్ చంద్రికా దీక్షిత్‌ను అరెస్ట్ చేశారన్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఆమెను అరెస్టు చేయలేదని, ఆమెపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్తలు నిజం కాదని వెల్లడించారు.

ఎవరీ వడా పావ్ గర్ల్‌..? 

చంద్రికా దీక్షిత్‌ అనే యువతి కొంతకాలంగా ఢిల్లీలోని మంగోల్‌పురి ఏరియాలో ఓ ఫుడ్ స్టాల్ న‌డుపుతోంది. వడా పావ్ గర్ల్‌‌గా ఆమె స్థానికంగా బాగా ఫేమస్. ఎంతలా అంటే, హైదరాబాద్‌లో కుమారి అంటీలా అన్నమాట. ఆమెకు ఇన్‌స్టాలో 30 ల‌క్షల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇటీవల ఆ యువతి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. తన ఫుడ్ స్టాల్‌ దగ్గర విందు ఏర్పాటు చేయగా.. స్థానికులతో వాగ్వాదం జరిగిందన్నది ఆ వీడియో సారాంశం. 

ఆమె వడా పావ్ బిజినెస్ కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నట్లు స్థానికులు.. మున్సిప‌ల్ అధికారుల‌కు పిర్యాదు చేశారు. దీంతో అనుమతి లేకుండా నడుపుతోన్న స్టాల్‌ను తొల‌గించాల‌ని మున్సిప‌ల్ అధికారులు ఆదేశించారు. అక్కడికి వెళ్లిన అధికారులతో ఆమె గొడ‌వ‌కు దిగింది. దీంతో పోలీసులు కలుగజేసుకొని.. స్టాల్‌ సీజ్ చేసి ఆమెను పోలీసు స్టేష‌న్‌కు తీసుకువెళ్లారు. ఆ వీడియో వైర‌ల్ అవ్వగా.. వడా పావ్ గర్ల్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దీంతో ఆమెపై ఎటువంటి కేసు బుక్ చేయ‌లేదని, ఆమెను అరెస్టు చేయ‌లేద‌ని ఔట‌ర్ ఢిల్లీ డీసీపీ వివరణ ఇచ్చారు. స్థానికుల నుంచి ట్రాఫిక్‌పై పలు ఫిర్యాదులు అందినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసుల పట్ల ఆమె దురుసుగా ప్రవర్తించినట్లు వెల్లడించారు.