బడ్జెట్ సెషన్‌‌‌‌‌‌‌‌లోనే డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక!

బడ్జెట్ సెషన్‌‌‌‌‌‌‌‌లోనే డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: శాసన మండలిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. 20 నెలలుగా ఖాళీగా ఉన్న మండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లోనే నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే అవకాశమున్నట్టు సమాచారం. మండలిలో చీఫ్‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌ సహా ఐదు విప్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులను ఈ సెషన్‌‌‌‌‌‌‌‌కు ముందే భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఫిబ్రవరి నెలాఖరుకు అసెంబ్లీ రద్దు చేస్తారని పొలిటికల్‌‌‌‌‌‌‌‌, అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ సర్కిల్స్‌‌‌‌‌‌‌‌లో చర్చ నడుస్తున్నది. మండలిలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌‌‌‌‌‌‌‌ కోసం పోటీపడే నేతల సంఖ్య తగ్గుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. దీంతో అభ్యర్థుల ఎంపిక కూడా ఈజీ అవుతుందని భావిస్తున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పదవిని సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్​కు అప్పగించేందుకు ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గతంలో ఈ పోస్టుకు ఎంపిక చేసిన నాయకుడిని చీఫ్‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌గా నియమించే చాన్స్ ఉన్నట్టు సమాచారం.

ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు

2021, జూన్‌‌‌‌‌‌‌‌ 3న మండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌ గుత్తా సుఖేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ నేతి విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌ల పదవీకాలం ముగిసింది. జూన్‌‌‌‌‌‌‌‌ 4 నుంచి 2022 జూన్‌‌‌‌‌‌‌‌ 4 దాకా భూపాల్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, 2022 జనవరి 11 నుంచి మార్చి 14 దాకా అమీనుల్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ జాఫ్రీ ప్రోటెం చైర్మన్‌‌‌‌‌‌‌‌లుగా వ్యవహరించారు. మార్చి 14న గుత్తా మరోసారి మండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికయ్యారు. అప్పుడే డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక ఉంటుందని ప్రచారం జరిగినా.. చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నికతోనే సరిపెట్టారు. 20నెలలుగా డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పోస్టు ఖాళీగా ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి నిర్వహించే బడ్జెట్‌‌‌‌‌‌‌‌ సమావేశాల్లో డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిసింది. 

రేసులో కడియం ముందంజ

ఈ పదవి రేసులో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌, మాజీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ మధుసూదనాచారి ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో ఈ పదవి బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌కు ఇస్తారని ప్రచారం జరిగినా.. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో కడియం శ్రీహరి రేసులో ముందున్నట్టు సమాచారం. కేబినెట్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌ బర్తరఫ్​ తర్వాత ముదిరాజ్‌‌ కులాలకే చెందిన బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ను రాజ్యసభ నుంచి మిడిల్‌‌‌‌‌‌‌‌ డ్రాప్‌‌‌‌‌‌‌‌ చేయించి ఎమ్మెల్యే కోటాలో కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు పంపారు. రాజేందర్‌‌‌‌‌‌‌‌ బర్తరఫ్‌‌‌‌‌‌‌‌తో ఖాళీ అయిన కేబినెట్‌‌‌‌‌‌‌‌ స్థానంలో బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌ను కేబినెట్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకుంటారనే చర్చ సాగింది. తర్వాత మండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పోస్టు ఖాయమని ప్రచారం జరిగినా అదీ దక్కలేదు.

సురభి వాణిదేవికి విప్ ​పదవి!

సురభి వాణిదేవికి విప్‌‌‌‌‌‌‌‌ పదవి దక్కొచ్చని తెలుస్తున్నది. ఈ ఏడాది మార్చితో పదవీకాలం ముగిసే వారిలోనూ కొందరు పదవి రెన్యూవల్‌‌‌‌‌‌‌‌తో పాటు ప్రమోషన్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పట్నం మహేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌,  కౌశిక్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, కౌశిక్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, శేరి సుభాశ్​ రెడ్డి, బస్వరాజు సారయ్య వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసే యోచనలో ఉన్నారు. వారిని మండలికే పరిమితం చేసి వారు టికెట్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్న స్థానాల్లో ఇతరులకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. 

కౌశిక్​ రెడ్డికి కీలక బాధ్యతలు!

బోడకుంటి వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు పదవీకాలం 2021, జూన్‌‌‌‌‌‌‌‌ 3వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి మండలిలో చీఫ్‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌ పోస్టు ఖాళీగానే ఉంది. మండలి డిప్యూటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా కడియం శ్రీహరి లేదా ఇంకొకరికి ఎన్నుకుంటే.. బండ ప్రకాశ్‌‌‌‌‌‌‌‌కు చీఫ్‌‌‌‌‌‌‌‌ విప్‌‌‌‌‌‌‌‌ పదవి దక్కొచ్చని తెలుస్తున్నది. మండలిలో ప్రస్తుతం విప్‌‌‌‌‌‌‌‌గా ఎం.ఎస్‌‌‌‌‌‌‌‌.ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావు ఒక్కరే ఉన్నారు. గతంలో మండలిలో ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌లుగా పనిచేసిన వారిలో పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, భానుప్రసాద్‌‌‌‌‌‌‌‌ రావు తిరిగి కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు ఎన్నికయ్యారు. పల్లా రైతుబంధు సమితి చైర్మన్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారు. ఆయన స్థానంలో వేరేవాళ్లకు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తారని సమాచారం. మిగిలిన ఇద్దరిని రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ చేస్తారా.. లేదా వేరే వాళ్లకు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తారా.. అనేది తేలాల్సి ఉంది. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే ఎమ్మెల్సీ కౌశిక్‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఏదో ఒక పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్​ ఉంది. ఆయనకు సహాయ మంత్రి హోదా ఉన్న మండలి విప్‌‌‌‌‌‌‌‌ పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతున్నది.