కోరుట్లలో BRS అభ్యర్థి ఇంట్లో దేవుడి వెండి వస్తువులు : ఓటర్లకు ఈ రేంజ్ లో పంపకాలా..!

కోరుట్లలో BRS అభ్యర్థి ఇంట్లో దేవుడి వెండి వస్తువులు : ఓటర్లకు ఈ రేంజ్ లో పంపకాలా..!

మరికొన్ని గంటల్లో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సమరం ప్రారంభం కాబోతున్నది. 11వ తేదీ పోలింగ్ జరగనుంది. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులకు ఈ ఒక్క రాత్రి మాత్రమే మిగిలి ఉంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో.. చివరి క్షణం వరకు ఓటర్లను ప్రభావం చేసే వ్యూహాలు అమలు చేస్తున్నారు అభ్యర్థులు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా.. వారి వారి శక్తికి మించి మరీ తాయిలాలు పంచటం అనేది ఎన్నికల్లో కనిపించే కామన్ విషయమే. ఈ క్రమంలోనే కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్న BRS పార్టీ అభ్యర్థి ఇంట్లో భారీ ఎత్తున వెండి ఆభరణాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జగిత్యాల జిల్లా కోరుట్లలోని 24వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో వెండి వెంకటేశ్వర స్వామి, యేసు ప్రభువు ప్రతిమలను స్వాధీన పరుచుకున్నారు ఎన్నికల అధికారులు. ఓటర్లకు పంచేందుకు వెండి ప్రతిమలు తెచ్చినట్లు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేపట్టారు అధికారులు. పక్కా సమాచారంతో మంగళవారం ( ఫిబ్రవరి 10 ) అభ్యర్థి ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు వెండి ప్రతిమలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఇళ్లలో అధికారుల తనిఖీలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్.ఈ క్రమంలో పోలీసుల తనిఖీలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఉద్రిక్తతకు దారి తీశాయి. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు పని చేస్తున్నారంటూ గాంధీ చౌక్ లో ధర్నాకు దిగారు ఎమ్మెల్యే సురేందర్. తమ పార్టీ అభ్యర్థుల ఇళ్లలోకి వెళ్లి పోలీసులు తనిఖీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే సురేందర్. ఎమ్మెల్యే మదన్ మోహన్ పిఏలు వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.