కన్యాకుమారి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ లేదని, అధికార పార్టీ డీఎంకే, టీవీకే మధ్య జరుగుతున్న యుద్ధమని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్నది 40 కోణాల పోటీ కాదని, కేవలం ప్రజలను ప్రేమించే విజయ్, ప్రజావ్యతిరేక స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమని పేర్కొన్నారు.
టీవీకే అధికారంలోకి వస్తే విప్లవాత్మక మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా 'ఏఐ మంత్రిత్వ శాఖ'ను ఏర్పాటు చేస్తామని, 'ఏఐ సిటీ' ద్వారా రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా మారుస్తామని ప్రకటించారు. తమిళనాడులో అప్పులు రూ. 10.5 లక్షల కోట్లకు చేరాయని, వడ్డీల రూపంలో చెల్లిస్తున్న ప్రతి పైసా సామాన్యుడి విద్య, వైద్యం నుంచి దోచుకున్నదేనని విమర్శించారు. అవినీతిని అంతం చేసేందుకు ‘తమిళనాడు సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్’, ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేసేందుకు ‘వెట్రి తమిళనాడు’ సూపర్ యాప్‌ను ప్రవేశపెడతామని వివరించారు.
తన ఎన్నికల గుర్తు అయిన 'విజిల్'తో విప్లవం సృష్టిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అబద్ధాలతో తనను తాను మోసం చేసుకోకుండా ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఒక్కసారి నమ్మాలని కోరారు. షెడ్యూల్ మార్పులు, ప్రమాదాల నేపథ్యంలో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు ఎన్నికల ప్రచారాన్ని వర్చువల్ పద్ధతిలో వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 23న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.
