సీపీఎస్‌‌‌‌ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించండి..లంచ్ అవర్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల జేఏసీ నిరసన

సీపీఎస్‌‌‌‌ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించండి..లంచ్ అవర్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల జేఏసీ నిరసన

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్‌‌‌‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌‌‌‌ను వెంటనే పునరుద్ధరించాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్​చేసింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌‌‌‌ 1ని ‘పెన్షన్‌‌‌‌ విద్రోహ దినం’గా పాటిస్తూ లంచ్‌‌‌‌ అవర్‌‌‌‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అబిడ్స్‌‌‌‌లోని బీమా భవన్‌‌‌‌, ఖైరతాబాద్‌‌‌‌లోని స్టాటిస్టిక్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వద్ద ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌‌‌‌ మారం జగదీశ్వర్‌‌‌‌, సెక్రటరీ జనరల్‌‌‌‌ ఏలూరి శ్రీనివాస్‌‌‌‌రావు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌‌‌‌లో ఉన్న ఆరు విడతల డీఏలను విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల పెండింగ్‌‌‌‌ బిల్లులను వెంటనే చెల్లించాలని, నూతన ఈహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ను అమలు చేయాలని డిమాండ్​చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌‌‌‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్​ పిలుపునిచ్చారు.