హారిబుల్ ఎంగేజ్ మెంట్ అంటే ఇదేనేమో
త్వరలో పెళ్లిచేసుకోబోతున్న ఓ జంట సరదాగా పార్క్‌కు వెళ్లారు. కాసేపు చేతిలో చెయ్యేసి కబుర్లు చెప్పుకున్నారు. ఓ చోట కూర్చొని ఏదైనా తింటూ మాట్లాడుకుందామనుకున్నారు. కానీ తమను ఓ ఘోస్ట్ వెంటాడుతోందని గుర్తించలేకపోయారు. ఏదో అలికిడై వెనక్కి తిరిగి చూస్తే.. ఒక్కసారిగా ఆ ఘోస్ట్ దూసుకొచ్చింది. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు పారిపోయారు. పాపం.. ఆ దెయ్యానికి వరుడు ముందుగా చిక్కాడు. అతణ్ని అంతమొందించి.. ఆమె కోసం వెతికింది. చివరికి ఆమెను కూడా చంపేసింది. ఇద్దరి శవాల్ని ‘ క్యాంప్ క్రిస్టల్ లేక్’ అని రాసి ఉన్న సైన్ బోర్డు దగ్గరకు లాక్కొచ్చింది. మరోసారి ఇటువైపు ఎవరైనా వచ్చారో… ఇంతే సంగతి అంటూ వార్నింగ్ ఇచ్చింది.
వరుసగా ఈ ఫొటోలను గమనిస్తే మీకు అర్థమయ్యే స్టోరీ ఇదే. అయితే మీకు ఏదో స్టోరీ చెప్పేందుకు వీరిద్దరు ఇలా ఫొటో దిగలేదు. ఇది వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ ఫొటో షూట్. అదేంటీ.. ఎంగేజ్మెంట్ ఫొటోలంటే ఒకరినొకరు పట్టుకొని.. ఒకరి కళ్లళ్లోకి ఒకరు చూస్తూ రొమాంటిక్‌గా దిగాలి కదా? ఇదేం పోయే కాలం..! వీళ్ల పైత్యం పాడుగాను!! అని తిట్టేసుకోకండి. అందరిలా వీళ్లూ రొటీన్‌గా ఫొటోలు దిగితే ఇప్పుడిలా మనమంతా చూసేవాళ్లమా? తమ ఎంగేజ్మెంట్ ఫొటోలు అందరూ ఆసక్తిగా చూడాలనుకున్నారు కాబట్టే.. వనెస్సా లాసన్, జోష్ మార్డెన్ అనే జంట ఇలా భిన్నంగా ఆలోచించారు.
ఇద్దరికీ హారర్ సినిమాలంటే ప్రాణం. అందుకే అదే థీమ్‌తో ఫొటోషూట్‌కు సిద్ధమయ్యారు. వారి ఆలోచనకు తగినట్లుగానే బ్రాండన్ గ్రే ఈ స్టోరీని ప్లాన్ చేసి, కెమెరాలో బంధించాడు. ఊహించినట్లుగానే వనెస్సా, జోష్‌ల ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేసేస్తున్నాయి.
