2021 నాటికి 2.35 లక్షల కోట్లకు వినోద పరిశ్రమ

2021 నాటికి 2.35 లక్షల కోట్లకు వినోద పరిశ్రమ

మీడియా, ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇండస్ట్రీ 2021 నాటికి రూ. 2.35 లక్షల కోట్ల మార్కు అందుకోనుంది. రాబోయే కొన్నేళ్లలో ఈ రంగం ఏటా 11.6 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 2017 తో పోలిస్తే 13.4 శాతం వృద్ధి చెందిన మీడియా, ఎంటర్‌ టైన్‌మెంట్‌ రంగం 2018 లో రూ.1.67 లక్షల కోట్లకు చేరిందని ఫిక్కి-ఈవై నివేదిక వెల్లడించింది. మీడియా, ఎంటర్‌ టైన్‌మెంట్‌ రంగంలో టెలివిజన్‌ అతి పెద్ద విభాగంగా నిలుస్తుండగా, అత్యధిక వృద్ధి మాత్రం డిజిటల్‌దే కాబోతోందని తెలిపింది. డిజిటల్‌ రంగం 2019 లో సినిమా ఎంటర్‌ టైన్‌మెంట్‌ ను, 2021 నాటికి ప్రింట్‌ మీడియాను కూడా డిజిటల్‌ మీడియా అధిగమిస్తుందని జోస్యం చెబుతోంది ఈ నివేదిక. ఫిక్కి ఫ్రేమ్స్‌‌ వార్షిక సదస్సు సందర్భంగా తాజా నివేదికను విడుదల చేశారు.

డిజిటల్‌ మీడియాపై తెగమోజు
దేశంలోని 57 కోట్ల ఇంటర్‌ నెట్‌ యూజర్లలో ప్రస్తుతం 25 లక్షల మంది ఒక్క డిజిటల్‌ మీడియాను మాత్రమే ఇష్టపడుతున్నారని, ఈ సంఖ్య 2021 నాటికి రెట్టింపై 50 లక్షలకు చేరుతుందని నివేదిక వెల్లడించింది. డిజిటల్‌ వినియోగం భారీగా పెరుగుతుంది. డిజిటల్‌ రంగంలో కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు, డబ్బు సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషిస్తారని పేర్కొంది. ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ఒక ప్రధాన విభాగంగా మారనుందని, డేటాతో కలిపి బండిల్‌ చేసి ఓటీటీ సేవలను వినియోగదారులకు టెల్కోలు ఆఫర్‌ చేస్తున్నాయని వివరించింది. సబ్‌ స్క్రిప్షన్‌ లలో వృద్ధిని ఎడ్వర్టైజ్‌ మెంట్‌ వృద్ధి ఇప్పటికే దాటేసిందని, 2021 నాటికి మొత్తంలో ఈ వాటా 52 శాతం ఉంటుందని తెలిపింది. 2018 లో టెలివిజన్‌ రంగం 12 శాతం వృద్ధితో రూ. 74 వేల కోట్లకు చేరింది. ఇందులో అడ్వర్టైజ్‌ మెంట్‌ విభాగం 14 శాతం పెరిగి రూ.30,500 కోట్లకు, సబ్‌ స్క్రిప్షన్‌ విభాగం 11 శాతం పెరిగి రూ. 43,500 కోట్లకు చేరాయి. ఇక టీవీ చూసే హౌస్‌ హోల్డ్స్‌ సంఖ్య కూడా 2016 తో పోలిస్తే 7.5 శాతం అధిక మై 19.7 కోట్లకు చేరిందని ఫిక్కి నివేదిక వివరించింది.

టీవీరంగంలో మరింత వృద్ధి
2021 నాటికి టెలివిజన్‌ రంగం రూ. 95 వేల కోట్లకు చేరనుంది. అడ్వర్టైజింగ్‌ విభాగం ఏటా 10 శాతం చొప్పున, సబ్‌ స్క్రిప్షన్‌ విభాగం 8 శాతం చొప్పున పెరుగుతాయని ఫిక్కి-ఈవై నివేదిక అంచనా వేస్తోంది. ప్రింట్‌ మీడియా రంగం చెప్పుకోవడానికి రెండో పెద్ద రంగమైనా వృద్ధి కేవలం 0.7 శాతానికే పరిమితమవడంతో, 2018 లో రూ.30,550 కోట్లకు చేరింది. ఇందులో అడ్వర్టైజ్‌ మెంట్‌ విభాగం వాటా రూ. 21,700 కోట్లైతే, సబ్‌ స్క్రిప్షన్‌ ఆదాయం కేవలం 1.2 శాతం పెరిగి రూ. 8,830 కోట్ల వద్ద నిలిచింది. ముఖ్యంగా న్యూస్ పేపర్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌ రంగంలో 1 శాతం క్షీణత నమోదైంది. మేగజైన్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌ రంగం ఏకంగా పది శాతం క్షీణించింది. పరిమాణం తక్కువ కావడంతోపాటు, ఎఫెక్టివ్‌ రేట్ల మీద ఒత్తిడి వల్లే అడ్వర్టైజింగ్‌ ఆదాయం తగ్గుతోందని నివేదిక పేర్కొంది. మొత్తం అడ్వర్టైజింగ్‌లో 37 శాతం వాటాతో హిందీ డైలీలు ముందున్నాయి. 25 శాతంతో ఇంగ్లీష్‌ డైలీలు రెండో స్థానంలో ఉన్నాయి. పెరుగుతున్న న్యూస్‌ ప్రింట్‌ ధరలు, రూపాయి విలువ క్షీణతలు రెండూ మార్జిన్ల మీద ప్రభావం చూపిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. రీజినల్‌ అడ్వర్టైజ్‌ మెంట్ ఒకింత మెరుగైన పనితీరుతో జాతీయ వృద్ధిని అధిగమించింది. నాన్‌ మెట్రో మార్కెట్ల మీద నేషనల్‌ బ్రాండ్స్‌‌ ఫోకస్‌ పెరిగిందని, జీఎస్‌ టీతో రెండు మార్కె ట్లలోనూ ఒకే విధమైన అవకాశాలు రావడమే ఈ ఫోకస్‌ మారడానికి కారణమని పేర్కొంది. ఓటీటీ, లీనియర్‌ ప్లాట్‌ ఫామ్స్‌‌ యాడ్స్‌‌ను కంబైన్‌ చేసి విక్రయించే పద్ధతిని ఇప్పటికే బ్రాడ్‌ కాస్టర్లు మొదలుపెట్టారని ఫిక్కి-ఈవై నివేదిక తెలిపింది. టీవీ చూసే వ్యూయర్ల సంఖ్య, ఫ్రీ టెలివిజన్‌ అప్‌ టేక్‌‌, ఛానెల్‌ రేట్లు, అడ్వర్టైజ్‌ మెంట్స్‌‌ మీద ట్రాయ్‌ టారిఫ్‌‌ ప్రభావం ప్రసరించే అవకాశం ఉందని కూడా ప్రాయపడింది. ఐతే, 2019 లో ఎలక్షన్లు, క్రికెట్‌ వరల్డ్‌‌ కప్‌ లు జరగనుండటంతో ఈ రంగంలో వృద్ధి మెరుగవుతుందని పేర్కొంది. 2017 తో పోలిస్తే డిజిటల్‌ న్యూస్‌ కన్స్ యూమర్లు 26 శాతం పెరిగి , 22.2 కోట్లకు చేరారని చెబుతూ, వారందరూ ఆన్‌ లైన్లో న్యూస్‌ చూస్తున్నట్లు తెలిపింది. ఇక పేజ్‌ వ్యూస్‌ 2017 తో పోలిస్తే 59 శాతం వృద్ధి చెందాయి. సగటున ఆన్‌ లో గడిపే సమయం కూడా రెట్టింపై రోజుకి ఎనిమిది నిమిషాలకు చేరింది.