హిస్టరీని ఇంట్రెస్టింగ్‌‌గా మారుస్తానంటోన్న ఎరిక్ చోప్రా

హిస్టరీని ఇంట్రెస్టింగ్‌‌గా మారుస్తానంటోన్న ఎరిక్ చోప్రా

హిస్టరీ సబ్జెక్ట్ బోర్ అంటుంటారు చాలామంది. కానీ అదే హిస్టరీని ఇంట్రెస్టింగ్‌‌గా మారుస్తానంటోంది ఎరిక్ చోప్రా. సోషల్ మీడియా ద్వారా యువతకు మనదేశ చరిత్రను  పరిచయం చేస్తోంది. హిస్టరీని సింపుల్ ఇన్‌‌స్టాగ్రామ్ పోస్టుల రూపంలో క్రియేటివ్‌‌గా ప్రజెంట్ చేస్తోంది. 75 ఏండ్ల స్వతంత్య్ర భారతాన్ని వేడుకగా జరుపుకోవడమంటే భారతీయ చరిత్రను కూడా గుర్తు చేసుకోవడమే. అలాంటి చరిత్రను ఎవరూ పట్టించుకోకపోవడం, హిస్టరీపై ఎవరికీ ఆసక్తి లేకపోవడం చూసి ఆశ్చర్యపోయింది ఎరిక్. బోర్ కొట్టించే చరిత్రను ఇంట్రెస్టింగ్‌‌గా చెప్పడం ఎలాగో ఆలోచించింది. ‘ఇతిహాసాలజీ’ పేరుతో బ్లాగ్, ఇన్‌‌స్టాగ్రామ్, ట్విట్టర్ పేజీలు క్రియేట్ చేసి యువతకు దేశ చరిత్రను గుర్తు చేస్తోంది.

జర్నల్‌‌తో మొదలుపెట్టి..

ఎరిక్.. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో అండర్ గ్రాడ్యుయేషన్ హిస్టరీ సబ్జెక్ట్​తో చదివింది. చదువుకునే రోజుల్లో ‘ఇతిహాసాలజీ’ పేరుతో ఒక హిస్టరీ జర్నల్‌‌ను మొదలుపెట్టింది. దానికి ఆమె ఎడిటర్‌‌‌‌గా ఉండేది. దేశంలో లిటరేచర్ ఫెస్టివల్స్, కల్చరల్ ఫెస్ట్​లు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్లేది. అంతేకాకుండా తానే స్వయంగా హెరిటేజ్ వాక్స్, మ్యూజియం విజిట్స్‌‌ ఏర్పాటు చేసేది.  ఎంత చేసినా చరిత్రపై ఆమెకున్న ఇంట్రెస్ట్ తగ్గకపోగా ఇంకా పెరిగింది. అందుకే చదువు పూర్తవగానే ‘ఇతిహాసాలజీ’ని  ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫామ్‌‌గా మార్చి సోషల్ మీడియాలో హిస్టరీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది.

బెస్ట్ ఇన్‌‌స్టాగ్రామ్ అకౌంట్‌‌

‘ఇతిహాసాలజీ’ అనేది ప్రత్యేకించి యూత్ కోసం తయారు చేసిన ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫామ్. చరిత్రను ఇప్పటి యువతకు అర్థమయ్యేలా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారానే సాధ్యం. అందుకే ఇన్‌‌స్టాగ్రామ్ పోస్టులు, ఫేస్‌‌బుక్ స్టోరీలు, యూట్యూబ్ వీడియోలతో పాటు  పాడ్‌‌కాస్ట్, బ్లాగ్, జర్నల్స్, బుక్ రివ్యూలు.. ఇలా అన్నిరకాల ప్లాట్‌‌ఫామ్స్‌‌ వాడుతూ చరిత్రను కథల రూపంలో ఇంట్రెస్టింగ్‌‌గా ప్రజెంట్ చేస్తోంది. ఎరిక్‌‌తో పాటు హిస్టరీపై మక్కువ ఉన్న కుద్రత్, సార్ధక్, హిబా, సమీర్, నందిని కూడా తనతో చేరారు. 2020లో ‘మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్’లో బెస్ట్ ఇండియన్ ఇన్‌‌స్టాగ్రామ్ అకౌంట్‌‌గా ‘ఇతిహాసాలజీ’ నిలిచింది.

సరళమైన పదాల్లో..

ఇతిహాసాలజీలో హిస్టరీ, ఆర్ట్, శిల్పకళ, ఫ్యాషన్, సినిమా లాంటి టాపిక్స్‌‌తో పాటు మన హిస్టరీలో ఆడవాళ్ల పాత్ర, వాళ్లు రాణించిన కళలు, ఇప్పటి యూత్‌‌కు పెద్దగా తెలియని అప్పటి ప్రేమ కథలు.. ఇలా ఎన్నో అంశాలుంటాయి. అయితే చెప్పదలుచుకున్న ప్రతీ విషయాన్ని 350 పదాల్లో ఇన్‌‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇంట్రెస్టింగ్‌‌గా చెప్పడం ఇతిహాసాలజీ ప్రత్యేకత. ‘ఇతిహాసాలజీ’ టీం కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాకుండా హెరిటేజ్ వాక్స్, మ్యూజియం వాక్స్, ఆన్‌‌లైన్ హెరిటేజ్ టూర్స్ , ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ పేరుతో స్టూడెంట్స్‌‌కు ఆన్‌‌లైన్ సెషన్లు, డిజిటల్ పబ్లికేషన్లు లాంటివెన్నో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇతిహాసాలజీ సోషల్ అకౌంట్స్‌‌ను ఫ్యాషన్ డిజైనర్లు, ఫిల్మ్ మేకర్స్, బుక్ రీడర్స్, ఆర్టిస్ట్స్.. ఇలా ఎంతో మంది ఫాలో అవుతున్నారు. 

చరిత్ర అంతం కాదు

చరిత్ర తెలుసుకోవడం వల్ల నాలెడ్జి మాత్రమే కాకుండా సొసైటీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చంటోంది ఎరిక్. మన చట్టాలు, హక్కులు, రాజ్యాంగంలోని అంశాలపై అవగాహన పెరుగుతుందని,  చరిత్ర ప్రతి ఒక్కరినీ రెస్పాన్సిబుల్ సిటిజన్‌‌గా మారుస్తుందని అంటుందామె. “స్కూల్‌‌లో చదువుకున్న హిస్టరీ కేవలం తేదీల వరకు మాత్రమే గుర్తుంటుంది. కానీ అందులో ఎన్నో కథలు దాగి ఉన్నాయి. అవన్నీ మన కథలు. వాటిని తెలుసుకున్నప్పుడే మన కల్చర్ ఎలా మొదలైంది? ఎలా మారుతూ వస్తోంది? అన్న విషయాలు తెలుస్తాయి.  చరిత్రను గుర్తు చేస్తే  సొసైటీలో కొంతవరకైనా మార్పు వస్తుంది. ముఖ్యంగా యువతకు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నన్నడిగితే చరిత్రకు మించిన ఆస్తి మరొకటి లేదు.

ఇతిహాసాలజీ మొదలుపెట్టినప్పుడు నన్ను చాలామంది ఒక ప్రశ్న అడిగేవారు. ‘చెప్పాల్సిన చరిత్ర అంతా అయిపోయినప్పుడు ఏం చేస్తావ్?’ అని. అయితే చరిత్ర ఎప్పటికీ అంతం కాదన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. వెలికి తీసే కొద్దీ చరిత్ర బయటపడుతూనే ఉంటుంది. భారతీయ చరిత్ర 1947 తో ముగుస్తుందనుకుంటారు చాలామంది. కానీ గడిచిన రోజులన్నింటినీ మనం చరిత్ర లాగానే చూడాలి. అలాగే చరిత్రను ఈ తరం వారికి ఏ కోణంలో చెప్తున్నాం అనేది కూడా ముఖ్యమే’’ అంటోంది ఎరిక్.

చరిత్ర విషయంలో మనం చేసిన మరొక పొరపాటు.. కొన్ని కథలను మాత్రమే చెప్పడం. ఒకే కథను చెప్పడం వల్ల విషయం ఒక కోణంలోనే అర్థమవుతుంది. ఆ కాలంలో జరిగిన మిగతా కథలను కూడా తెలుసుకుంటే విషయంపై పూర్తి  క్లారిటీ వస్తుంది. మేము చేస్తున్నది కూడా అదే. మనకు తెలియని ఎన్నో కథలు, మరుగున పడిపోయిన వ్యక్తుల జీవితాలు, ప్రపంచానికి పరిచయమవ్వని జానపద కథలు, పేర్లు లేని పుస్తకాలు, ఆర్ట్‌‌.. ఇలా ఎక్స్​ప్లోర్​ చేయని చరిత్ర చాలానే ఉంది. దీన్ని దేశానికి తెలియజేయాలి. ముఖ్యంగా యూత్‌‌కు దేశ చరిత్ర తెలియాలి. వాళ్లకు అర్థం కాని విషయాలను అర్థమయ్యే భాషలో చెప్పాలి. బోర్ కొట్టించే హిస్టరీని మరింత సరదాగా, ఆకర్షణీయంగా, యూత్ మాట్లాడుకునే భాషలో చెప్పాలి. అప్పుడే చరిత్ర అందరికీ చేరువవుతుంది”
- ఎరిక్ చోప్రా