కొండపాక , వెలుగు: అనారోగ్యంతో దొమ్మాట(ప్రస్తుతం దుబ్బాక) మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన దొమ్మాట రామచంద్రారెడ్డి అప్పటి దొమ్మాట నియోజకవర్గానికి 1983 నుంచి 1988 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతరం ఎన్టీఆర్ తో విభేదించి టీడీపీని వీడి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. సోమవారం ఉదయం కొండపాకలో మాజీ ఎమ్మెల్యే భౌతికాయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కు సమకాలీనుడైన రామచంద్రారెడ్డి ప్రజా సేవకు పరితపించేవారని, గతంలో రామచంద్రారెడ్డి అనారోగ్యం పాలైతే కేసీఆర్ ఆర్థికసాయం చేశారని గుర్తు చేశారు. మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి తో పాటు స్థానిక నాయకులు గ్రేటర్ హైదరాబాద్ జాగృతి అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, నూనె కుమార్ యాదవ్, దుర్గయ్య తదితరులు సంతాపం తెలిపారు.

