V6 News

సంపన్నుల నయా అడ్డాగా న్యూజిలాండ్.. గోల్డెన్ వీసాకు భారీగా పెరిగిన క్రేజ్

సంపన్నుల నయా అడ్డాగా న్యూజిలాండ్.. గోల్డెన్ వీసాకు భారీగా పెరిగిన క్రేజ్

న్యూజిలాండ్ అంటే కేవలం పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన లైఫ్ స్టైల్ మాత్రమే కాదు.. ఇప్పుడు అది ప్రపంచ కుబేరులకు సరికొత్త ఇన్వెస్ట్మెంట్ అడ్డాగా మారింది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా నుంచి సంపన్న వ్యాపారవేత్తలు ఈ దేశం వైపు క్యూ కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం న్యూజిలాండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ అనే ‘గోల్డెన్ వీసా’ ప్రోగ్రామ్. కేవలం ఒక్క ఏడాదిలోనే ఈ స్కీమ్ ఊహించని స్థాయిలో ఏకంగా 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

డబ్బుకు విలువిచ్చే 'గోల్డెన్' అవకాశం..
న్యూజిలాండ్ తన ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు, స్థానిక వ్యాపారాల్లోకి పెట్టుబడులను తీసుకురావడానికి ఈ పథకాన్ని గత ఏడాది సమూలంగా ప్రక్షాళన చేసింది. ఇప్పటికే 1.49 బిలియన్ల న్యూజిలాండ్ డాలర్ల పెట్టుబడులు దేశంలోకి రాగా.. మరో 2.415 బిలియన్ల న్యూజిలాండ్ డాలర్ల పెట్టుబడులు పైప్‌లైన్‌లో ఉన్నాయి. ఈ క్రేజ్ ఎంతలా ఉందంటే.. కేవలం 659 అప్లికేషన్ల ద్వారానే సుమారు 2,155 మంది ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 2025 నుంచి నిబంధనలను సడలించడంతో ఈ జోరు మరింత పెరిగింది.

ఈ గోల్డెన్ వీసా పొందాలనుకునే వారికి ప్రభుత్వం రెండు ప్రధాన మార్గాలను. ఒకటి నేరుగా స్థానిక కంపెనీల్లో లేదా ఫండ్లలో 5 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి. దీని కాలపరిమితి మూడేళ్లు. ఇక రెండో మార్గం.. బాండ్లు లేదా ఇతర ఆస్తుల్లో 10 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్లను 5 ఏళ్ల పాటు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీసా పొందాలంటి ఇంగ్లీష్ భాషా పరీక్ష అవసరం లేకపోవటమే. అప్లై చేసేవారు తమ జీవిత భాగస్వామితో పాటు 24 ఏళ్ల లోపు పిల్లలను కూడా తీసుకెళ్లవచ్చు. అక్కడ నివసించడానికి, పని చేయడానికి, చదువుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.

ALSO READ :  3 ఏళ్లు హెచ్1బి వీసాల జారీ రద్దు.. 

క్యూ కడుతున్న అగ్రరాజ్యాలు..
న్యూజిలాండ్ అందిస్తున్న గోల్డెన్ వీసా కోసం పోటీ పడుతున్న దేశాల జాబితా ఆసక్తికరంగా ఉంది. అత్యధికంగా అమెరికా నుంచి 234 అప్లికేషన్లు రాగా.. చైనా 108 అప్లికేషన్లతో రెండో స్థానంలో ఉంది. ఇక స్విడ్జర్లాండ్, నెథర్లాండ్స్, కెనడా, ఫ్రాన్స్, రష్యా, హాంకాంగ్, తైవాన్, జర్మనీ దేశాల ధనవంతులు కూడా న్యూజిలాండ్‌లో సెటిల్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. భారత్ నుండి కూడా ఈ రేసులో అడుగులు పడ్డాయి.

చిన్న పరిశ్రమలకు పెట్టుబడులు అందించడం ద్వారా ఉపాధి కల్పనను పెంచడమే తమ లక్ష్యమని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్‌ఫోర్డ్ పేర్కొన్నారు. మొత్తానికి, న్యూజిలాండ్ తన "గోల్డెన్ వీసా"తో ప్రపంచ సంపదను తనవైపు తిప్పుకుంటూ ఆర్థిక వృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.