అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించి సెటిల్ అవ్వాలనుకునే భారతీయులకు.. ముఖ్యంగా తెలుగు యువతకు ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. హెచ్-1బి వీసా ప్రోగ్రామ్‌ను 3 ఏళ్ల పాటు పూర్తిగా నిలిపివేస్తూ.. ఆ తర్వాత కఠినమైన నిబంధనలతో పునరుద్ధరించాలని కోరుతూ రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎంపీలు అమెరికా కాంగ్రెస్‌లో ఒక కీలక బిల్లును ప్రవేశ పెట్టడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ఏమిటీ 'ఎండ్ హెచ్-1బి వీసా అబ్యూస్ యాక్ట్ 2026'?
రిపబ్లికన్ ఎంపీ ఎలి క్రేన్ నేతృత్వంలో "End H-1B Visa Abuse Act of 2026" పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చారు. అమెరికన్ కార్పొరేట్ సంస్థలు స్థానిక నిపుణులకు బదులు తక్కువ జీతానికే వచ్చే విదేశీయులను నియమించుకుంటున్నాయని, దీనివల్ల అమెరికన్ల ఉపాధి దెబ్బతింటోందని ఈ బిల్లు వాదిస్తోంది. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే మూడేళ్ల పాటు వీసాల జారీని ఆపాలని బిల్లు ప్రతిపాదించింది.
బిల్లులోని అత్యంత కఠినమైన ప్రతిపాదనలు:
ఈ బిల్లు చట్టంగా మారితే హెచ్-1బి వీసా విధానం రూపురేఖలే మారిపోతాయి. ప్రధానమైన మార్పులు ఇవే:
కోటా తగ్గింపు: ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న 65,000 వీసాలను ఏకంగా 25,000కు తగ్గించాలని ప్రతిపాదించారు.
కనీస వేతనం 2 లక్షల డాలర్లు: హెచ్-1బి వీసా పొందాలంటే ఏడాదికి కనీసం 2 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. కోటి 67 లక్షల జీతం ఉండాలి. ఇది ప్రస్తుతం ఉన్న వేతనాల కంటే చాలా ఎక్కువ.
లాటరీ రద్దు: ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, అత్యధిక జీతం ఇచ్చే వారికే వీసాలు కేటాయించాలని సూచించారు.
డిపెండెంట్లు, గ్రీన్ కార్డ్‌పై నిషేధం: వీసా పొందిన వారు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకురాకూడదని, అలాగే హెచ్-1బి నుండి నేరుగా గ్రీన్ కార్డ్‌కు మారడాన్ని నిషేధించాలని బిల్లు పేర్కొంది.
OPT రద్దు: విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలని కోరారు.
భారతీయులపై ప్రభావం:
హెచ్-1బి వీసాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నది భారతీయులే. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో నిపుణులు ఈ వీసాల పైనే అమెరికా వెళ్తుంటారు. థర్డ్ పార్టీ స్టాఫ్ కన్సల్టెన్సీలు హెచ్-1బి ఉద్యోగులను నియమించుకోకుండా నిషేధించాలనే ప్రతిపాదన భారతీయ ఐటీ రంగానికి పెద్ద దెబ్బ కానుంది.
అమెరికన్ కార్పొరేట్ సంస్థలు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నప్పటికీ, రిపబ్లికన్ ఎంపీలు మాత్రం "అమెరికా ఫస్ట్" నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయుల డ్రీమ్స్ చివరికి కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.

