సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. శనివారం ( ఏప్రిల్ 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం చిన్ననెమిల దగ్గర టాటా ఏస్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
టాటా ఏస్ అతివేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం.మృతులు చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన కొమ్ము బాబుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి పండగ కోసం వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడ్డవారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో చిన్ననెమిల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. టాటా ఏస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

