ఆల్కహాల్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు అనేది ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం. కొన్ని రీసెర్చ్ లు మందు కంట్రోల్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు అని కూడా ఫలితాలు వెల్లడించాయి. కానీ కొద్దిగ తాగినా.. మీడియంగా తాగినా సీరియస్ ప్రాబ్లమ్స్ తప్పవని రీసెంట్ స్టడీలో వెల్లడైంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన స్టడీలో.. ఆల్కహాల్ వినియోగం ఎక్కువ మందిలో క్యాన్సర్ ముప్పుకు దారి తీస్తున్నట్లు తేలింది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ లో పబ్లిష్ అయిన ఫలితాలు ఆలోచింపజేస్తున్నాయి.
- పెరుగుతున్న క్యాన్సర్ భారం:
ఆస్ట్రేలియాలో ఆరోగ్యం, వృద్ధాప్యంపై జరుగుతున్న అతిపెద్ద అధ్యయనం జరిగింది. 2 లక్షల 25 వేల మందికి పైగా పాల్గొన్న ఈ స్టడీలో మద్యపానం సేవించే వారిపై పరిశోధన చేశారు. వారానికి 10 సార్లు తాగే క్యాన్సర్ వచ్చే ప్రమాదం 19% పెరుగుతుందని ఫైండింగ్స్ లో తేల్చారు. ఆస్ట్రేలియాలో వచ్చే అన్ని క్యాన్సర్లలో 4.6 శాతం మద్యం సేవించడం వల్లనే వస్తున్నాయని తేలింది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 19 శాతం పెరుగుతుందని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని క్యాన్సర్ ఎలిమినేషన్ కొలాబరేషన్‌కు చెందిన పరిశోధకుడు డాక్టర్ పీటర్ సారిచ్ తెలిపారు.
గతంలో ఆస్ట్రేలియాలో మద్యం వల్ల వచ్చే క్యాన్సర్ల శాతం 2.8% నుండి 4.1% వరకు ఉండేది. ప్రతి పానీయంతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. పరిశోధకులు మద్యపాన స్థాయిలను క్యాన్సర్ ప్రమాదంతో పోల్చి చూసి, 2024లో ఆస్ట్రేలియాలో 7,800కు పైగా క్యాన్సర్ కేసులు మద్యం వల్లే సంభవించాయని కనుగొన్నారు. ఇది మొత్తం కేసులలో 4.6 శాతానికి సమానం.
- వారానికి తీసుకునే ప్రతి 10 డ్రింక్స్ ప్రభావం:
శ్వాసకోశ పైభాగంలో వచ్చే జీర్ణాశయ క్యాన్సర్ (నోరు, గొంతు, స్వరపేటి, అన్నవాహిక) 27% పెరిగింది.
కొలొరెక్టల్ క్యాన్సర్‌లో 16% పెరుగుదల
కాలేయ క్యాన్సర్‌లో 46% పెరుగుదల
రొమ్ము క్యాన్సర్‌లో 18% పెరుగుదల.
ఆల్కహాల్ నుంచి ప్రమాదాన్ని తగ్గించడానికి, వారానికి 10 డ్రింక్స్, రోజుకు నాలుగు డ్రింక్స్ కు మించకూడదని 2020లో నేషనల్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (NHMRC) గైడ్ లైన్స్ విడుదల చేసింది. అయితే ప్రస్తుతం అంతకంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోందని.. క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుందని స్టడీలో తేలింది. రీసెర్చర్స్ కొత్త క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ NSW ఆల్కహాల్ కు ఫైండిగ్స్ పంపించారు.
ఆల్కహాల్ క్యాన్సర్‌కు కారణమవుతుందని జనాభాలో సగం మందికి మాత్రమే తెలుసని అధ్యయనాలు చూపిస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ వంటి సాధారణ క్యాన్సర్‌లకు, మద్యపానానికి మధ్య బలమైన సంబంధం ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఆస్ట్రేలియాలో క్యాన్సర్ బాధితులను తగ్గించేందుకు, మందు తాగటాన్ని తగ్గించేందుకు ఈ ఫలితాలు దోహదపడతాయని రీసెర్చర్స్ చెబుతున్నారు.

