- ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ
పిట్లం, వెలుగు : కల్లు దుకాణాన్ని గ్రామ శివారులోకి తరలించకుండా ఉండడంతో పాటు తనిఖీలు, కేసులు లేకుండా చూసుకునేందుకు లంచం తీసుకున్న ఓ ఎక్సైజ్ సీఐని ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మద్నూర్ మండల కేంద్రంలో నడుస్తున్న కల్లు దుకాణాన్ని గ్రామ శివారులోకి మార్చాలని గతంలో ఆఫీసర్లు సూచించారు. అయితే కల్లు దుకాణాన్ని తరలించకుండా ఉండడంతో పాటు తనిఖీలు, కేసులు లేకుండా చూసుకునేందుకు బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ రూ. 3 లక్షలు డిమాండ్ చేయగా.. చివరకు రూ. 2 లక్షలకు ఒప్పందం కుదిరింది.
అనంతరం కల్లు దుకాణం యజమాని ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచనతో కల్లు దుకాణం యజమాని శుక్రవారం బిచ్కుందలోని సీఐ ఇంటికి వెళ్లి డబ్బులు ఇచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు సీఐ సత్యనారాయణను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో సోదాలు చేయగా... మరో రూ. 45 వేలు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే శంషాబాద్‌లో ఉన్న సీఐ నివాసంలో సైతం సోదాలు జరుపి రూ. 12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సీఐ సత్యనారాయణను శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
పాల్వంచ డివిజన్ ఆఫీస్‌లో ఏసీబీ విచారణ
పాల్వంచ, వెలుగు : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ డివిజన్ ఆఫీస్‌లో శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు విచారణ నిర్వహించారు. గతంలో పలు ఫిర్యాదులు అందడంతో గతేడాది జులై 18న సోదాలు నిర్వహించిన ఏసీబీ ఆఫీసర్లు, శుక్రవారం మరోసారి ఆఫీస్‌కు చేరుకొని పలువురిని విచారించారు. గతంలోజరిపిన విచారణలో కొన్ని అనుమానాలు ఉన్న నేపథ్యంలో మరోసారి విచారణ జరిపామని ఏసీబీ సీఐ బాలాజీ తెలిపారు.

