కోరం లేని గ్రామసభ తీర్మానాల ఆమోదంపై వివరణ ఇవ్వండి

కోరం లేని గ్రామసభ తీర్మానాల ఆమోదంపై వివరణ ఇవ్వండి

 

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: షెడ్యూల్డ్‌‌ ఏరియాల్లో కోరం లేకున్నా గ్రామసభ జరిపి తీర్మానాలు చేసేందుకు వీలుగా జీవో జారీ చేశారనే కేసులో వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్లు, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. కోరం లేకపోయినా గ్రామసభ నిర్వహించి తీర్మానం పొందేలా 2019లో జారీచేసిన జీవో.. షెడ్యూల్డ్‌‌ ప్రాంతాల హక్కులు కాలరాసేలా ఉందని లంబాడి హక్కుల పోరాట సమితి నగర భేరీ ప్రధాన కార్యదర్శి భూక్యా దేవా నాయక్‌‌ హైకోర్టును ఆశ్రయించారు. షెడ్యూల్డ్‌‌ ఏరియాల్లో ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, వనరులు, వివాదాల పరిష్కారం కోసం గిరిజన ప్రాంతాల్లో విధిగా గ్రామసభలు నిర్వహించాలని పిటిషనర్‌‌ లాయర్​ చెప్పారు. పెసా చట్టం ప్రకారం గ్రామసభకు విధిగా 1/3 సభ్యులు హాజరుకావాలనే నిబంధన ఉందని చెప్పారు. కనీసం 50 శాతం గిరిజనులు హాజరుకావాలన్నారు. ప్రభుత్వ జీవో 54ను కొట్టివేయాలన్నారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌కుమార్‌‌ జూకంటి బెంచ్​కౌంటర్‌‌ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించి.. విచారణను నాలుగు వారాలు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.