
- మగ బిడ్డల పునరుత్పత్తిపైనా తీవ్ర ప్రభావం
- ఎలుకలపై ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి
సికింద్రాబాద్, వెలుగు: మహిళలు గర్భధారణ సమయంలో ప్లాస్టిక్‌లో ఉండే బిస్ఫెనాల్-ఏ (బీపీఏ) కెమికల్ ప్రభావానికి గురైతే పుట్టబోయే పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ఎఫెక్ట్ పడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) సైంటిస్టులు హెచ్చరించారు. బీపీఏ కెమికల్ ప్రభావంతో పుట్టబోయే శిశువులకు అంధత్వం వచ్చే అవకాశాలు ఉంటాయని, మగబిడ్డలు అయితే వారి పునరుత్పత్తి సామర్థ్యంపైనా తీవ్ర ప్రభావం ఉంటుందని వెల్లడించారు. ఎలుకలపై తాము జరిపిన తొలి దశ ప్రయోగాల్లో ఈ విషయాలు తేలాయని ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ మాలిక్యులర్ బయాలజీ విభాగం సైంటిస్ట్ డాక్టర్ సంజయ్ బసక్ వెల్లడించారు.
పరిశోధనలో భాగంగా తాము గర్భం దాల్చిన ఎలుకలను రెండు గ్రూపులుగా విడదీసి ఒక గ్రూపు ఎలుకలను బీపీఏ కెమికల్ ప్రభావానికి గురిచేశామన్నారు. 21 రోజుల తర్వాత పరిశీలించగా.. బీపీఏ ప్రభావానికి గురి చేయని ఎలుకలు సంతతి సాధారణంగానే ఉండగా, బీపీఏ ప్రభావానికి గురైన ఎలుకలకు జన్మించిన సంతానంలో లోపాలు కనిపించాయన్నారు. ప్రధానంగా ఈ ఎలుకల మగ సంతానంలో ఏకాగ్రత తగ్గిందని, వీటి స్పెర్మ్ రక్షణకు కావాల్సిన వ్యవస్థ క్షీణించిందన్నారు. దీనివల్ల యుక్త వయసులో ఆ మగ ఎలుకల్లో స్పెర్మ్ లోపంతో వంధ్యత్వానికి దారితీస్తుందని వివరించారు. గర్భం దాల్చిన మహిళలు బీపీఏ కెమికల్ ఉండే ప్లాస్టిక్ వస్తువుల వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న విషయం తమ రీసెర్చ్ తో తేలిందన్నారు.