V6 News

30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయండి..కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్  కొనుగోలు చేయండి..కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) బాయిల్డ్ రైస్ సేకరించాల‌ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి,  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు తెలంగాణ అనుకూలమని  కేంద్ర మంత్రికి తెలియజేశారు.

గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెప్పారు. ఏప్రిల్ 17న  మంత్రి ఉత్తమ్ తో కలిసి సీఎం  రేవంత్ ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో కలిశారు.

దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్‌ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని వివరించారు.

యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, అందువల్ల యాసంగి పంటకు సంబంధించి మొత్తం 30 ఎల్‌ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్‌ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రికి చెప్పారు.  బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి  సీఎం రేవంత్  ప్రతిపాదనకు కేంద్ర మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.

 2014–15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ. 1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని  ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కోరారు.

 పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకు గాను పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్ పరిధిలో పంపిణీ చేసేవారని, ఇటీవల దానిని నిలిపివేశారని పేర్కొంటూ వెంటనే పునఃప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.