నాసిరకం నూనెలతో కల్తీ చేసి.. ఒరిజినల్ ఆవునెయ్యిగా అమ్ముతున్నారు..గుజరాత్ లో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు

నాసిరకం నూనెలతో కల్తీ చేసి.. ఒరిజినల్ ఆవునెయ్యిగా అమ్ముతున్నారు..గుజరాత్ లో కల్తీ నెయ్యి ముఠా గుట్టురట్టు

‘‘కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు’’ ఉప్పు నుంచి నూనెల వరకు అన్ని తినే పదార్థాలను కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. అక్రమసంపాదనే లక్ష్యంగా కల్తీకి పాల్పడుతూ  ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రతి వస్తువును కల్తీ చేస్తున్నారు. నిత్యావసరాలైన అల్లం వెల్లుల్లి పేస్ట్ లు, సబ్బులు, పేస్ట్ లు, నూనెలు, నెయ్యి వంటి ఆహార పదార్ధాలను రసాయనాలు, చౌకపదార్థాలతో చేయడంతో  ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. గుజరాత్ లో ని సూరత్ లో భారీ ఎత్తున నకిలీ నెయ్యి బయపడటంతో ఆహార పదార్థాల కల్తీపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

సూరత్ లోని  కామ్రేజ్ తాలూకా నవగామ్ ప్రాంతంలో  నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించారు పోలీసులు.ఆరాధ్య మార్కెటింగ్ అండ్ డెయిరీ ప్రొడక్ట్స్ అనే కంపెనీ ద్వారా  నకిలీ నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నారు కల్తీగాళ్లు.  నెయ్యిని నాసిరకం ఆయిల్స్ కలిపి కల్తీ చేసి ఒరిజనల్ ఆవు నెయ్యిగా ప్యాక్ చేసి చెలామణి చేస్తున్నారు. పోలీసులదాడులతో కేటుగాళ్ల నకిలీ దందా రహస్యం వెలుగు చూసింది. దాడుల్లో సుమారు రూ.3 లక్షల విలువైన ముడి పదార్థాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 15 కిలోల చొప్పున ఉన్న 25 కంటైనర్లలో కూరగాయల నూనె, 7 కంటైనర్లలో పామాయిల్, అలాగే మూడు నకిలీ నెయ్యి కంటైనర్లు గుర్తించారు.

 కూరగాయల నూనె, పామాయిల్‌ను కలిపి నెయ్యిగా తయారు చేసి, దానిని బ్రాండెడ్ ఉత్పత్తిగా చూపించి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. ఈ మొత్తం నకిలీ దందాను స్తానిక సుముల్ డైరీ చెందిన కిరణ్ మోడీ (40) అనే వ్యక్తి నడిపిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.