ఉప్పల్, వెలుగు: ఉప్పల్ ఎక్స్ రోడ్ అడ్డాగా సాగుతున్న నకిలీ కొలువుల దందా బట్టబయలైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠా ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉప్పల్‌లోని ‘కెరీర్ రైట్ వే సొల్యూషన్స్’ అనే కన్సల్టెన్సీని ఫిబ్రవరిలో చెడే ఫణీంద్ర అనే బాధితుడు సంప్రదించాడు.
అనంతరం ఫణీంద్రను అత్యం నాగసాయి, మధు, వంశి అనే వ్యక్తులు బెంగళూరులోని ప్రముఖ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, విడతల వారీగా లక్ష రూపాయలు వసూలు చేశారు. భాగ్యరేఖ అలియాస్ సోను అనే మహిళను హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేశారు. ఆమె ద్వారా నకిలీ నియామక పత్రాన్ని అందజేసి, మూడు వారాల పాటు ట్రైనింగ్ పేరుతో కాలయాపన చేశారు.
అనంతరం నిందితుల ఫోన్ నంబర్లు స్విచ్ఛాఫ్ రావడం, ఆఫీస్‌కు కూడా మూసివేసి ఉండడంతో బాధితుడు శుక్రవారం ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. తనలాగే మరికొంతమంది కూడా వీరి చేతిలో మోసపోయారని బాధితుడు తెలియడంతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

