పోలీసుల అవతారమెత్తి యువకుల కిడ్నాప్.. ఫామ్ హౌస్లో బంధించి రూ.13 లక్షల వసూలు.. జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు

పోలీసుల అవతారమెత్తి యువకుల కిడ్నాప్.. ఫామ్ హౌస్లో బంధించి రూ.13 లక్షల వసూలు.. జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: పాత కేసును సెటిల్ చేస్తామంటూ పోలీసుల అవతారమెత్తి యువకులను కిడ్నాప్ చేయడమే కాకుండా ఫామ్ హౌస్​లో బంధించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరానికి చెందిన నిఖిల్ అనే యువకుడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ఈ క్రమంలో సదరు యువతి గతేడాది గచ్చిబౌలి పోలీస్ స్టేషన్​లో నిఖిల్​పై ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

ఈ కేసును సెటిల్ చేస్తామని చెబుతూ కొందరు వ్యక్తులు ఏప్రిల్ 10న తమను పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. తొలుత నిఖిల్ స్నేహితుడు సాయిని కిడ్నాప్ చేశారు. అతడిని బెదిరించి నిఖిల్ చిరునామా తెలుసుకున్నారు. అనంతరం అనంతపురానికి వెళ్లిన నిందితులు నిఖిల్​తో పాటు మరో ఇద్దరు స్నేహితులను బలవంతంగా అదుపులోకి తీసుకుని మొయినాబాద్ అజీజ్​నగర్​లోని ఓ ఫామ్ హౌస్​కు తరలించారు.

అక్కడ బాధితులను బంధించి, కేసు సెటిల్మెంట్ పేరుతో తీవ్ర ఒత్తిడి తీసుకువస్తూ రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు నిఖిల్ తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అమ్మడంతో పాటు, తండ్రి నుంచి డబ్బు తీసుకుని మొత్తం రూ. 13.26 లక్షలను నిందితులకు చెల్లించాడు. డబ్బులు చెల్లించిన తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితుడు శనివారం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనలో సుధీర్ బాబు, జాన్, ప్రసాద్ రెడ్డి అనే ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తును  ముమ్మరం చేశారు.