
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసింది. చంద్రగ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఆదివారం (సెప్టెంబర్ 07) రాత్రి 9.56 గంటలకు మూతపడ్డ ఆలయాలు తెరుచుకున్నాయి. తెలంగాణలో ప్రముఖ ఆలయాలన్నీ సోమవారం (సెప్టెంబర్ 08) ఉదయం నుంచి తెరుచుకున్నాయి. దాదాపు తెల్లవారుజామున 3.30 తర్వాత ఆలయాలు తెరుచుకున్నాయి. ఆలయ శుద్ధీ, సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు వేదపండితులు.
తెరుచుకున్న వేములవాడ రాజన్న ఆలయం, కోడెను తిప్పీ ప్రత్యేక పూజలు:
చంద్రగ్రహణం ఎఫెక్ట్ తో వేములవాడ రాజన్న ఆలయం 10 గంటలపాటు మూసివేశారు అధికారులు. చంద్రగ్రహణం ముగియడంతో సోమవారం తెల్లవారుజామున 3:45 నిమిషాలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి.. ఆలయ తలుపులు తెరిచారు అర్చకులు.
ఆలయ ప్రాంగణంలో స్వామి వారి చుట్టూ కోడెను తిప్పి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాత:కాల పూజ అనంతరం ఉదయం 7 గంటల నుంచి యధావిధిగా భక్తుల దర్శనాలు ప్రారంభం అయ్యాయి.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం:
గ్రహణం కారణంగా మూతపడ్డ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సోమవారం తెల్లవారుజామున తెరిచి సంప్రోక్షణ చేశారు ఆలయ అర్చకులు. సంపూర్ణ చంద్ర గ్రహణం ముగియడంతో ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేశారు.
నిత్యా కైంకర్యాలు నిర్వహించి యధావిధిగా స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతించారు. దాదాపు 10 గంటలపాటు ఆలయం మూసి ఉండటంతో.. ఉదయం దర్శనానికి భక్తులు తరలివచ్చారు.
బాసర సరస్వతీ ఆలయం:
చంద్రగ్రహణం ఎఫెక్ట్ తో మూతపడిన బాసర సరస్వతీ ఆలయం తెరుచుకుంది. గ్రహణనంతరం అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ చేశారు పూజారులు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసిన పూజారులు చేశారు. సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు పూజారులు.
భద్రాచలం సీతారామాలయం:
సంపూర్ణ చంద్రగహణం తర్వాత రామాలయం తెరుచుకుంది. భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. దాని కారణంగా సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని ఆదివారం (సెప్టెంబర్ 07) మధ్యాహ్నం 1 గంట కు రామాలయం ముఖ ద్వారాలు మూసివేసారు.
చంద్ర గ్రహణం అనంతరం సోమవారం (సెప్టెంబర్ 08) తెల్లవారు జామున ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, సుప్రభాత సేవ, ఆరాధనా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతించారు.