రెండో వన్డేలోనూ శుభ్మన్ గిల్ చెలరేగుతాడా..?

రెండో వన్డేలోనూ శుభ్మన్ గిల్ చెలరేగుతాడా..?

శుభ్‌మన్ గిల్...ప్రస్తుతం భారత క్రికెట్లో మారుమోగుతున్న పేరు. తాజా క్రికెటర్ల నుంచి..మాజీ క్రికెటర్ల వరకు..అతని ఆటను ఆకాశానికి ఎత్తుతున్నారు. గతేడాది తొలి వన్డే సెంచరీ చేసిన గిల్..ఈ ఏడాది ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 23 ఏళ్ల శుభ్ మన్ గిల్..కెరీర్లో తొలి డబుల్ సెంచరీ కొట్టేశాడు. ప్రస్తుతం గిల్ కెరీర్లోనే బెస్ట్ ఫాంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో  రాయ్‌పూర్‌లో జరిగే రెండో వన్డేలో అందరి కళ్లు గిల్ పైనే ఉండనున్నాయి. ఈ వన్డే టీమిండియాకు కీలకం. ఈ మ్యాచ్లో భారత జట్టు గెలుస్తే సిరీస్ను దక్కించుకోనుంది. ఈ క్రమంలో  మరోసారి గిల్ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఉప్పల్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ పిచ్..అందులోనూ గిల్ సూపర్ ఫాంలో ఉండటంతో  డబుల్ సెంచరీతో చెలరేగాడు. భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండో వన్డే జరిగే  రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం పిచ్ పై ఇప్పటికీ క్లారిటీ లేదు.  కారణం ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు. భారత్,  కివీస్ మధ్య జరిగే రెండో వన్డేనే ఇక్కడ తొలి అంతర్జాతీయ మ్యాచ్. అయితే గతంలో ఈ పిచ్పై  కొన్ని ఐపీఎల్, సీఎల్‌టీ20 మ్యాచ్‌ లు జరిగాయి. వాటి ప్రకారం..పిచ్ బౌలర్లకు ఉపయోగపడనుంది. పిచ్  బౌలర్లకు సహకారం అందిస్తే మాత్రం స్కోరు 250 దాటకపోవచ్చు. అయితే బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ తయారు చేస్తే మాత్రం...మరోసారి భారీ స్కోర్లు నమోదవడం ఖాయం. దీంతో ప్రస్తుతం అందరి చూపు గిల్ పైనే ఉంది.  అతను రెండో వన్డేలో ఎలా ఆడతాడని ఆసక్తి నెలకొంది. ఏదేమైనా రెండో వన్డేలోనూ గిల్ బ్యాటు ఝుళిపించాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.