ఉప్పల్, వెలుగు: పంట అమ్మగా వచ్చిన పైకంతో ఇంటికి వెళ్తుండగా, ఓ రైతు పిక్ పాకెటింగ్‌కు గురయ్యాడు. కష్టార్జితం చేజారడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన రైతు పోలు అశోక్ ఈ నెల 5న తాను పండించిన మామిడి పండ్ల లోడ్‌ను బాటసింగారం మార్కెట్‌కు తీసుకెళ్లాడు. మరుసటి రోజు లావాదేవీలు ముగించుకుని, చేతికొచ్చిన రూ. 55 వేలను జేబులో పెట్టుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. ఉప్పల్ ఎక్స్ రోడ్డులో బస్సు దిగిన అశోక్.. అక్కడి నుంచి నల్ల చెరువు కట్ట వద్ద ఉన్న హన్మకొండ బస్టాప్‌కు చేరుకోవడానికి ఆటో ఎక్కాడు.
ఆటో బస్టాప్ దాటి ముందుకెళ్తుండడంతో రైతు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆటోలో ఉన్న ఓ వ్యక్తి రైతు అశోక్‌ను సముదాయించినట్లుగా నటించి అక్కడ దింపేసి వెళ్లిపోయాడు. అంతలోనే జేబు తడుముకుని చూసుకోగా, తన ప్యాంటు జేబు కత్తిరించి ఉండటం, అందులో దాచుకున్న రూ. 55 వేల నగదు మాయమవడంతో లబోదిబోమన్నాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
