రైతులకు ట్రైనింగ్​ లేదు.. మీటింగుల్లేవ్​

రైతులకు ట్రైనింగ్​ లేదు.. మీటింగుల్లేవ్​
  • వానకాలం సీజన్ వచ్చినా తాళాలు తీస్తలే
  • ఇప్పటికీ ఫర్నిచర్, కుర్చీలు రాలే
  • కొన్ని చోట్ల గోడౌన్లుగా మార్చిన ఆఫీసర్లు
  • ట్రైనింగ్​పై గైడ్​లైన్స్​  రాలేదన్న వ్యవసాయ శాఖ

ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ రైతు వేదికల్లేవు. మనదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవు. మన దగ్గర చరిత్రకు శ్రీకారం చుట్టినం. వీటి కోసం దాదాపు రూ.600 కోట్లు ఖర్చు పెట్టినం. ఈ ఖర్చు ఒట్టిగనే పెట్టలే. గొప్ప ఉద్దేశం, వ్యూహంతో, పటిష్టమైన అవగాహనతో వీటిని కట్టినం తప్ప తమాషాకి కాదు. ఈ రైతు వేదిక ఓ ఆటమ్​బాంబు. అద్భుతమైన శక్తి. రైతు వేదికల్లోకి పోతే మాకేం వస్తది అనుకుంటారో ఏమో.. అందులోకి పోతె బంగారం వస్తది. బతుకు వస్తది. ఈ వేదికలు వేస్ట్​గావొద్దు. ఈ 2,600 క్లస్టర్లు వస్తే రైతుల ఐకమత్యమేంటో చూపిస్తం.

- గతేడాది అక్టోబర్​30న జనగామ జిల్లా కొడకండ్లలోని 
రైతు వేదిక ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​ మాటలివి

కరీంనగర్/ నెట్ వర్క్, వెలుగు: కొత్త సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా కట్టిన రైతు వేదికలకు తాళాలు వేలాడుతున్నాయి. సర్పంచులు, కార్యదర్శులకు టార్గెట్‌‌ పెట్టి మరీ రూ. 600 కోట్లతో పూర్తి చేసిన వేదికలు ఇంకా నిరుపయోగంగానే ఉన్నాయి. ఇటీవలి గాలివానలకు క్వాలిటీ లేని కొన్ని రైతు వేదికల రేకులు లేచిపోయి, గోడలకు బీటలు వారాయి. వాటికి రిపేర్లు నడుస్తున్నాయి. అంతా సక్కగ ఉన్న వేదికల్లో రైతులు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేకుండా పోయాయి. కొన్ని చోట్ల వేదికలు గోడౌన్లయ్యాయి. వ్యవసాయ శాఖనేమో రైతులకు ట్రైనింగ్‌‌పై తమకు గైడ్‌‌ లైన్స్‌‌ రాలేదని చెబుతోంది. 

రాష్ట్రవ్యాప్తంగా 2,604 రైతువేదికలు 

రాష్ట్రంలో మెజారిటీ రైతులు సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు సాగు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో దిగుబడి రావట్లేదు. దేశంలో పత్తి బాగా పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నా సగటు ఉత్పత్తిలో వెనుకబడింది. గుజరాత్​లో హెక్టారు​కు సగటున 707 కేజీలు, హర్యానాలో 665 కిలోలు వస్తుంటే తెలంగాణలో 515 కేజీల దిగుబడే వస్తోంది. వరిలోనూ ఇంచుమించు ఇదే పరిస్థితి ఉంది. డిమాండ్​లేని పంటల సాగుతో మార్కెటింగ్​లేక రైతులు నష్టపోతున్నారు. చాలా మంది రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని తగ్గించారు. అవగాహన లేని కొందరు రైతులు విచ్చలవిడి ఎరువులు, పురుగుమందులు వాడుతుండటంతో భూములు నిస్సారమవుతున్నాయి. దీంతో కొత్త సాగు విధానాలు, కొత్త వంగడాలు, పురుగు మందుల వాడకం, విత్తనాల ఎంపిక సేంద్రియ, ప్రకృతి సేద్యంపై రైతులకు సరైన శిక్షణ ఇవ్వాలని సర్కారు భావించింది. ఇందుకోసం ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్​ చొప్పున మొత్తం 2,604 రైతు వేదికలను నిర్మించింది. ప్రతి క్లస్టర్​కు రూ. 22 లక్షల చొప్పున రూ. 573 కోట్లు ఖర్చు పెట్టి గతేడాది సర్పంచులు, కార్యదర్శులను ఉరుకులు పరుగులు పెట్టి మరీ పూర్తి చేయించింది. 

పూర్తయి నెలలవుతున్నా..

రైతు వేదికలు పూర్తయి నెలలవుతున్నా ఎక్కడా కూడా వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభమై రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నా తాళాలు తీయలేదు. ఎక్కడా రైతులకు శిక్షణ ఇవ్వట్లేదు. ట్రైనింగ్‌‌పై ఇప్పటివరకు తమకు గైడ్​లైన్స్ రాలేదని క్లస్టర్ ఏఈవోలు, ఏవోలు, సైంటిస్టులు చెబుతున్నారు. 2014కు ముందు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సీజన్​ప్రారంభంలో ఊరూరా ‘రైతు చైతన్య యాత్ర’ పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. టీఆర్ఎస్​ప్రభుత్వం వచ్చాక ‘మన తెలంగాణ – మన వ్యవసాయం’ పేరుతో ఏడాది పాటు  నిర్వహించి చేతులు దులుపుకుంది. తర్వాత రైతు వేదికలు కట్టి రైతులకు పంటల సాగులో సూచనలిస్తామని, దేశంలోనే గొప్ప రైతులుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ వేదికలు పూర్తయి నెలలవుతున్నా ట్రైనింగ్‌‌ను పట్టించుకోలేదు. వాస్తవానికి రైతుల మీటింగులే కాకుండా ఏఈవోలు కూడా ఇక్కడి నుంచే పనిచేయాలి. భూసార పరీక్షలకు సైతం ఇదే సెంటర్‌‌గా ఉండాలి. కానీ ఏ క్లస్టర్‌‌లోనూ ఏఈవోలు రైతులకు అందుబాటులో ఉండట్లేదు. సాయిల్ టెస్టులూ చేయట్లేదు.

మీటింగ్ అయితే  ఎట్ల కూసుకోవాలె? 

రైతు వేదికలను అందరికీ కనిపించేలా రంగులతో తీర్చిదిద్దారు కానీ కావాల్సిన ఫర్నిచర్‌‌ను మాత్రం నేటికీ అందించలేదు. ఏఈవో కోసం ఏర్పాటు చేసిన రూమ్‌‌లో టేబుల్, కుర్చీ, అల్మారా ఉండాలి. వీటిని ఇంకా తెప్పించలేదు. మీటింగులు పెడితే రైతులు కూర్చోవడానికి కుర్చీలు కావాలి. ప్రతి వేదికకు 120 కుర్చీలు అందిస్తామని ఆఫీసర్లు చెప్పారు. కానీ ఏ రైతు వేదికకూ అందలేదు. వీటి కోసం లోకల్‌‌గా టెండర్లు పిలుస్తున్నా సర్కారు బిల్లులు ఇవ్వదని ఎవరూ ముందుకు రావట్లేదు. ఇటీవల చాలా జిల్లాల్లో వడ్లు పోసే జాగ లేక రైతు వేదికలను ధాన్యంతో నింపేశారు.

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక, కుర్తివాడలో కట్టిన రైతు వేదికలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కొన్ని నెలల క్రితం ఆర్భాటంగా ప్రారంభించారు. వానాకాలం సీజన్ ​ప్రారంభం కావడంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు  పంటల సాగుపై శిక్షణ ఇస్తారేమోనని, ఒకదగ్గర కూర్చొని మాట్లాడుకునే అవకాశం వస్తదేమోనని రైతులు ఆశపడ్డారు. అయితే రెండు చోట్లా రైతు వేదికలను వడ్ల బస్తాలతో నింపేశారు. ఇవి ఎప్పుడు ఖాళీ చేస్తారో, ఎప్పుడు కుర్చీలు వేసి ట్రైనింగ్ ఇస్తారో తెలియట్లేదు.