అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మెట్ పల్లి/తిమ్మాపూర్, వెలుగు: అప్పుల బాధతో మరో రైతు ఉరేసుకున్నడు. భూరికార్డుల్లో తప్పు కారణంగా మరో రైతు ఎమ్మార్వో ఆఫీసులోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిండు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన ముత్యాల పెద్ద నర్సయ్య (49)కు రెండెకరాల సాగు భూమి ఉండేది. అప్పులు పెరిగిపోవడంతో కొన్నాళ్ల క్రితం ఒకటిన్నర ఎకరం భూమి అమ్మి కొంత మేరకు అప్పులు చెల్లించాడు. మిగిలిన అరెకరంలో పంట దిగుబడి సరిగ్గా రాలేదు. ఇంకా రూ. 8 లక్షల మేరకు అప్పులు మిగిలాయి. కొన్ని రోజులుగా అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ప్రెజర్ పెరుగుతుండటంతో ఆయన ఆందోళనకు గురయ్యాడు. దీంతో బుధవారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకుని చనిపోయాడు. 

భూరికార్డుల్లో తప్పు సరిచేస్తలేరని.. 
రెవెన్యూ అధికారులు తన భూమిలో కొంత భాగాన్ని వేరే వాళ్లకు రికార్డులో తప్పుగా నమోదు చేయడం, కుటుంబ అవసరాల కోసం భూమిని అమ్ముకోవాల్సి రావడంతో కలత చెందిన ఓ రైతన్న ఎమ్మార్వో ఆఫీసులోనే పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదుల గట్టేపల్లికి చెందిన మీస రాజు అనే రైతు భూమిని రెవెన్యూ అధికారులు 2018లో అదే గ్రామానికి చెందిన మీస భిక్షపతికి తప్పుగా నమోదు చేశారు. ఈ విషయమై రాజు ఎన్ని సార్లు తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. భిక్షపతి తన పేరిట నమోదైన భూమిని నిరుడు వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాజు భార్య సుమలత సైతం రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఉన్న భూమిని కూడా అమ్ముకోవాల్సి రావడంతో మనస్తాపం చెందిన రాజు బుధవారం కుటుంబసభ్యులతో కలిసి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు, సిబ్బంది అతనిని 108లో కరీంనగర్ సర్కార్ దవాఖానకు తరలించారు. కుటుంబసభ్యుల సమక్షంలో విరాసత్ చేయాల్సిన అధికారులు.. ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు పలువురు ఆరోపించారు.