సూర్యాపేట మార్కెట్ ​కమిటీ ఆఫీసుకు రైతుల తాళం

సూర్యాపేట మార్కెట్ ​కమిటీ ఆఫీసుకు రైతుల తాళం

సూర్యాపేట, వెలుగు : సన్నాలకు మద్దతు ధర ఇవ్వడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. సూర్యాపేట అగ్రికల్చర్​మార్కెట్ లో వ్యాపారులు సిండికేట్ గా మారి ధర తగ్గించి మోసం చేస్తున్నారని ఆగ్రహించిన రైతులు సోమవారం హైదరాబాద్ – విజయవాడ హైవేను దిగ్బంధించారు. దాదాపు రెండు గంటల పాటు ఆందోళన చేశారు.  

హమాలీల సమ్మెతో షురూ 

ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పటికీ కొనుగోళ్లు లేట్​ చేస్తుండడం, సన్న వడ్లు కొనకపోవడంతో  రైతులు సూర్యాపేట మార్కెట్ కు కూడా వడ్లను తీసుకువస్తున్నారు. సోమవారం ఈ సీజన్​లోనే రికార్డు స్థాయిలో 42,760 బస్తాల వడ్లను మార్కెట్​కు తీసుకువచ్చారు. ఇందులో చింట్లు 23,035 బస్తాలు ఉన్నాయి.  అయితే సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో అధికారులు, కమీషన్ ఏజెంట్లు వేధిస్తున్నారని మార్కెట్​ముందు హమాలీ కార్మికులు ఒక్కసారిగా ధర్నా, రాస్తారోకోకు దిగారు. 2018 నుంచి తమ లైసెన్సులు రెన్యువల్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో మార్కెట్ లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్అధికారులు హమాలీలతో మాట్లాడి విరమింపజేసినప్పటికీ మంగళవారం నుంచి వడ్లను తరలిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందారు. వర్షం వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.  
 

మద్దతు ధర ఇవ్వకపోవడంతో....

కలెక్టర్ చెప్పినా రైతులకు మద్దతు ధర రావడం లేదు. రూ.1401 ధర కంటే తక్కువకు కమిషన్ దారులు కొనొద్దని ఆర్డర్స్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. హమాలీల నిరసన విరమించిన తర్వాత సన్న వడ్లను రూ.1250 నుంచి కొనడం మొదలుపెట్టారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 200 మంది మార్కెట్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. మద్దతు ధర కోసం మార్కెట్ కమిటీ ఆఫీస్ కు తాళం వేశారు. అయినా మార్కెట్ పాలకవర్గం, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఆందోళన అలాగే కొనసాగించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పినా రైతులు పట్టువీడకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వీరికి మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి, బీజేపీ  జిల్లా ప్రధాన కార్యాదర్శి సలిగంటి వీరేంద్ర, సీపీఎం లీడర్లు బైఠాయించారు. తర్వాత హైదరాబాద్- –విజయవాడ హైవే పై బైఠాయించారు. రెండు వైపులా ట్రాఫిక్​ భారీగా నిలిచిపోవడంతో ఆర్‌డీఓ రాజేంద్రప్రసాద్ అక్కడికి వచ్చి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ ​భారీగా నిలిచిపోవడంతో నిరసన విరమించి మళ్లీ మార్కెట్​కమిటీ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు.  రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. పోలీసులు వచ్చి ప్రతిపక్ష పార్టీల లీడర్లను అరెస్ట్ చేశారు. రాత్రి కావడంతో రైతులు కూడా నిరసన విరమించి వెళ్లిపోయారు. 

గతంలోను ఆందోళనలు 

గతంలోనూ కమిషన్ దారులు, అధికారులు, మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి మద్దతు ధర రాకుండా మోసం చేస్తున్నారని రైతులు ఆందోళనలు చేశారు. స్పందించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి రూ.1500 లకు తక్కువగా కొనుగోలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయినా వ్యాపారులు తీరు మార్చుకోలేదు.  
 

వంక పెట్టి రూ.1400 ఇచ్చిన్రు 

నాలుగు రోజుల క్రితం వడ్లకు రూ.1700 ఇచ్చారు. ఇప్పుడు పచ్చిగా ఉన్నాయని వంక పెట్టి రూ.1400 ఇచ్చారు. అడిగితే అమ్మితే అమ్ము లేకపోతే పో అంటున్నారు. ఇప్పటికే నష్టపోయాం. మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకువెళ్లలేక అమ్ముకున్నాం.
- వెంకన్న, సూర్యాపేట

రెండు రోజులు ఆగినా  అదే ధర  

రెండు రోజుల కింద మార్కెట్ కు వడ్లను తీసుకొస్తే పచ్చిగా ఉన్నాయని రూ.1250 ఇస్తామమన్నారు. రెండు రోజులు మార్కెట్ లో తిండి తినకుండా ఉన్న. ఇవాళ కాంటా పెట్టిస్తే అదే రూ.1250 ఇస్తామన్నారు. అడిగితే బయట కూడా ఎవ్వరూ తీసుకోవట్లే. ఎక్కువ ధర ఇవ్వలేమంటున్నరు.ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– లక్ష్మి, సూర్యాపేట