వడ్లకు నిప్పు..కొనుగోలు కేంద్రానికి తాళం

వడ్లకు నిప్పు..కొనుగోలు కేంద్రానికి తాళం

వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా ఇందుర్తిలో రైతులు వాటర్ ట్యాంకు ఎక్కి ఆందోళన చేశారు. క్వింటాలు వడ్లకు10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడిలోనూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. మిల్లర్ల తీరుకు నిరసనగా వడ్లకు నిప్పు పెట్టారు.  

వెలుగు, నెట్​వర్క్:  వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్​చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కుతున్నారు. తరుగు పేర మిల్లర్ల దోపిడీ, ధాన్యం ఎండలేదని సెంటర్లలో తూకాలు వేయకపోవడంతో ఆఫీసర్లపై మండిపడుతున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగాయి.  కరీంనగర్​ జిల్లా ఇందుర్తిలో రైతులు వాటర్ ట్యాంకు ఎక్కి ఆందోళన చేశారు. క్వింటాలు వడ్లకు10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో రైతులు గురువారం రోడ్డుపై బైఠాయించారు. మిల్లర్ల తీరుకు నిరసనగా వడ్లకు నిప్పు పెట్టారు. కొనుగోలు కేంద్రంలో మంచి వడ్లనే కొంటామంటూ 5 నుంచి10 కిలోల తరుగు తీస్తున్నారని వారు ఆరోపించారు. చేతికొచ్చిన పంట అకాలవర్షాలతో నేలపాలైందని వాపోయారు. తడిసిన వడ్లు మొలకలొస్తున్నా మా గోస పాలకులు పట్టించుకోరా అని నిలదీశారు. 

కొనుగోలు కేంద్రానికి తాళం
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్​ మండలం పోతుగల్ పీఏసీఎస్ పరిధిలోని ఆవునూరు ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. నెల రోజుల నుంచి సెంటర్​లో వడ్ల కుప్పలు పోసి రేయింబవళ్లు పడిగాపులు పడుతున్నా ధాన్యం కొంటలేరని మండిపడ్డారు. వడ్లు తడిసి కుప్పల్లోనే మొలకలొస్తున్నాయన్నారు. సొసైటీ అధికారుల తీరుతో విసుగు చెందిన రైతులు తమ వడ్లను తామే అమ్ముకుంటామని, మీరెవరూ కొనుగోలు కేంద్రాల దగ్గరకు రావద్దని హెచ్చరించారు. మిల్లర్లతో సొసైటీ అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. 

వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు
వడ్లను వెంటనే కొనాలని కోరుతూ కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వారికి సీపీఐ లీడర్లు మద్దతిచ్చారు. ఇందుర్తిలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు సెంటర్​లో 15 రోజుల నుంచి ఆరబోసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. సొసైటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తహసీల్దార్​ ముబిన్, ఎస్సై సుధాకర్ ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు.  ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ట్యాంక్ దిగి వచ్చారు.