పంట మార్పిడిపై అనాసక్తి .. వరి సాగుకే మెజారిటీ రైతుల మొగ్గు

పంట మార్పిడిపై అనాసక్తి .. వరి సాగుకే మెజారిటీ రైతుల మొగ్గు
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 16లక్షల ఎకరాల సాగులో ..
  •  సుమారు 9లక్షలకుపైగా వరి పంటే..
  • కోతుల బెడదతో కూరగాయలు, పప్పు దినుసుల సాగుకు వెనుకంజ
  • ఇప్పుడిప్పుడే ఆయిల్‌‌‌‌పామ్ వైపు రైతుల దృష్టి

సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా రైతులు ఆ దిశగా ఆసక్తి చూపడం లేదు. వరిసాగుకే మెజారిటీ రైతులు మొగ్గు చూపుతున్నట్లు అధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 16లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. సుమారు 9లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ వైపు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండగా, సరైన దిగుబడులూ రావడం లేదు. అయినా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లడం లేదు. 

కోతుల బెడద, కూలీల కొరత, ప్రతిరోజూ పర్యవేక్షణ, శారీరక శ్రమ ఎక్కువగా చేయాల్సి రావడం వంటి కారణాలతో కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర పంటల వైపు రైతులు దృష్టి సారించడం లేదు. కాగా పంట మార్పిడి చేసి భూసారంతోపాటు లాభసాటి పంటలు పండించాలని సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్‌‌‌‌లో ఉమ్మడి జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఆయిల్‌‌‌‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని, అందుకు అవసరమైన సలహాలు, సూచనలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. 

కూలీల కొరత, కోతుల బెడదే సమస్య

ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 7.50 లక్షల మంది రైతులు దాదాపు 16 లక్షల ఎకరాల్లో  వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇతర పంటలతో పోలిస్తే వరి సాగుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవడంతోపాటు కొనుగోలు సెంటర్లలో మద్దతు ధరకు వడ్లు కొంటుండడంతో రైతులు వరి వైపే మొగ్గుతున్నారు.

 మరోవైపు నీటి లభ్యత పెరగడం, వరిలో యంత్రాల వాడకం పెరగడం కూడా సాగు పెరగడానికి కారణాలు. దీంతోపాటు వరికి కోతుల బెడద కూడా తక్కువ. ఉమ్మడి జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో గతంలో పండించిన వేరుశనగ, కంది, పెసర వంటి పప్పు దినుసుల పంటల సాగుకు రైతులు వెనుకాడుతున్నారు. 

వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే చేతికందే సమయానికి కోతులు పంటను నాశనం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు. కోతుల సమస్యతోపాటు కూలీల కొరత వేధిస్తోంది. దీంతో పంట చేతికి వచ్చే సమయానికి అదనపు ఖర్చులు పెరగడం, పంటలను ప్రతిరోజు పర్యవేక్షించాల్సి రావడంతో రైతులు వరి వైపే మొగ్గుతున్నారు. కాగా ఇటీవల ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగు పెరుగుతోంది. ప్రభుత్వ పరంగా విస్తృత అవగాహన  కల్పించడంతో పాటు దీర్ఘ కాలికంగా లాభాలు వచ్చే పంట కావడంతో సిద్దిపేట జిల్లాలో కొంత మేర ప్రగతి కనిపిస్తున్నా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం దీనికి ఆశించన మేర స్పందన కనిపించడం లేదు.

ఉమ్మడి జిల్లాలో పంటల సాగు ఇలా.. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో పంటల సాగులో వరిదే అగ్రస్థానం. మెదక్ జిల్లలో 3,67,668 ఎకరాలు సాగులో ఉండగా అత్యధికంగా 3,16,690 ఎకరాల్లో వరి సాగుకానుంది. 2025 వానాకాలంలో 3,15,675 ఎకరాల్లో సాగవగా.. ఈసారి ఇంకా పెరగనుంది. 

వరి తర్వాత పత్తి 36 వేల ఎకరాలు, మొక్కజొన్న 3 వేల ఎకరాలు, కంది 1,850, పెసర 1,250, మినుము 700, సోయాబీన్ 125 ఎకరాలు, కూరగాయలు 708 ఎకరాలు, జొన్న 40 ఎకరాలు, చెరకు 75 ఎకరాలు,  ఇతరల పంటలు 5,425 ఎకరాలు సాగుచేస్తారని అధికారుల అంచనా.
 సిద్దిపేట జిల్లాలో మొత్తం ప్రస్తుత వానాకాలంలో మొత్తం 5.08 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా వీటిలో దాదాపు 3.80 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. వరిలో సన్న రకాల సాగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. పత్తి 1.20 లక్షలు, మొక్కజొన్న 40వేలు, కంది 5 వేలు, పెసర 2 వేలు, కూరగాయలు 5 వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. గతేడాదితో పోలీస్తే ఈ సీజన్‌‌‌‌లో 10 వేల ఎకరాల్లో వరి సాగు పెరగనుంది. 


* సంగారెడ్డి జిల్లాలో పంట మార్పిడిపై రైతులు ఆసక్తి చూపచడం లేదు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 7,54,986 ఎకరాల్లో సాగవగా.. ఈసారి మరో 10వేల ఎకరాలు పెరిగి, 7,64,580 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. 

కాగా జిల్లాలో అత్యధికంగా పత్తి 3,82,511 ఎకరాల్లో, సెకండ్ ప్లేస్‌‌‌‌లో వరి 1,59,070 ఎకరాల్లో, కంది పంట 75,677 ఎకరాల్లో, సోయాబీన్  61,312 ఎకరాల్లో, చెరకు 27,986, మొక్కజొన్న 9,563, పెసర్లు 8,491, మినుములు 5,792, ఉద్యాన పంటలు 30,956 ఎకరాల్లో సాగు చేసేందుకు అధికారులు అంచనా వేశారు.

పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కోతుల బెడదతో పప్పు దినుసులు, కూరగాయ తోటల సాగుకు రైతులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పంట మార్పిడిలో భాగంగా ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ తోటల విస్తీర్ణాన్ని పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాం. పంట మార్పిడి వల్ల భూసారం పెరగడమే కాకుండా రైతులకు లాభసాటి పంటలను సాగు చేయడానికి అవకాశం లభిస్తుంది.

-దేవకుమార్, డీఏవో మెదక్-