సబ్​స్టేషన్లు ముట్టడించి రైతుల ధర్నాలు 

సబ్​స్టేషన్లు ముట్టడించి రైతుల ధర్నాలు 
  • పగటిపూట 5 గంటలకు మించి ఇస్తలే
  • రోజులో ఇచ్చే 10 గంటల్లోనూ కోతలు
  • బోర్లు నడువక ఎండుతున్న పంటలు

భూపాలపల్లి, వెలుగు/నెట్​వర్క్: రాష్ట్రంలో త్రీఫేజ్ కరెంట్ కోతలు తీవ్రమయ్యాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సర్కారు చెప్తున్నప్పటికీ పగటిపూట 5 గంటలకు మించి పవర్ ​ఉంటలేదు. రాత్రిపూట కూడా కలిపితే రోజుకు 8 నుంచి 10 గంటలు దాటుతలేదు. దీంతో బోర్లు, పంపులు నడువక వరి, మక్క, మిర్చి, కూరగాయ తోటలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల దున్నుకాలు జరగక, నారు ముదిరిపోతోంది. ఈ క్రమంలో ఆగ్రహిస్తున్న రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సబ్​స్టేషన్లను ముట్టడించి నిరసన తెలిపారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో సబ్‌‌‌‌ డివిజన్‌‌‌‌, మండల స్థాయి లోనే త్రీఫేజ్​ కరెంట్ సప్లై జరిగేది. కానీ సీఎం కేసీఆర్‌‌ వ్యవసాయానికి‌‌ 24 గంటల ఉచిత కరెంట్‌‌‌‌ అంటూ ప్రచారం చేశాక ఈ సిస్టమ్​పక్కనపెట్టారు. కానీ యాసంగి సీజన్‌‌‌‌ ప్రారంభం నుంచి కరెంటు సమస్యలు తీవ్రమయ్యాయి. గతవారం నుంచి రోజుకు 4 నుంచి 8 గంటలు కూడా సప్లయ్‌‌‌‌ కావట్లేదు. పై ఆఫీసర్లు జిల్లా, మండలాల వారీగా వాట్సాప్‌‌‌‌ గ్రూప్‌‌‌‌లు క్రియేట్‌‌‌‌ చేసి రోజు ఏ టైమ్​కు ఏ ఫీడర్‌‌‌‌కు కరెంట్‌‌‌‌ ఇవ్వాలి.. ఎప్పుడు బంద్‌‌‌‌ చేయాలి అనేది మెసేజ్‌‌‌‌ చేస్తున్నరు. ఫోన్‌‌‌‌ కు మెసేజ్‌‌‌‌ వస్తేనే కరెంట్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ చేస్తున్నమని, సప్లయ్‌‌‌‌ బంద్‌‌‌‌ చేయాలని మెసేజ్‌‌‌‌ వస్తే బంద్‌‌‌‌ చేస్తున్నమని పలువురు ఏఈలు, లైన్‌‌‌‌మెన్లు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. 

వ్యవసాయ కరెంట్​కోతలకు  నిరసనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల రైతులు ఆందోళన చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ను రైతులు ముట్టడించారు. రెండు నెలలగా కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదని ధ్వజమెత్తారు. 24 గంటలు కరెంటు వస్తుందనే నమ్మకంతో పంటలు సాగుచేశామని, రోజుకు 5 గంటలు కూడా కరెంటు ఉంటలేదని వాపోయారు. కండ్ల ముందే పంటలు ఎండిపోతుంటే సబ్ స్టేషన్ ముట్టడించామన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలు సబ్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఐనవోలు, ఒంటిమామిడిపల్లి, నాగపురం గ్రామాలకు చెందిన దాదాపు 60 మంది రైతులు ధర్నా చేశారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా సరిగా జరగడం లేదని, పదేపదే ట్రిప్​అవుతోందని ఆరోపించారు. సబ్ స్టేషన్ లోని ఆఫీసర్లను అడిగితే ఏఈ, డీఈల అనుమతితోనే ఎల్​సీ ఇస్తున్నట్లు చెబుతున్నారని, నీళ్లు పారక నారుమడులు ఎండుతున్నాయని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం సబ్​స్టేషన్ ను అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ముట్టడించారు.  కోమారరం ఫిడర్ పరిధిలో రాత్రిపూట కరెంట్​ ఇస్తుండడంతో అటవీప్రాంతంలో ఉన్న రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయానికి విద్యుత్ కోతలపై రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో రైతులతో కలిసి బీజేపీ లీడర్లు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు మెమోరాండం అందజేశారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతల విధింపును నిరసిస్తూ ఇచ్చోడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు ఇచ్చోడ, బజార్ హత్నూర్ మండలాలకు చెందిన రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు ఇచ్చోడ డివిజన్  ఏడీ సుబ్రహ్మణ్యంను వారు నిలదీశారు. కరెంటు సరిగా ఇవ్వకపోతే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు.

దున్నిన దుక్కులు ఎండుతున్నయ్

ఈ రైతు పేరు భాషబోయిన రాజయ్య. ఈయనది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్‌‌‌‌. ఐదెకరాల్లో వరి నాటు వేసేందుకు దుక్కి సిద్ధం చేసి వారం రోజులైతున్నది. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ త్రీఫేజ్‌‌‌‌ కరెంటు కోతలతో పొలం సరిగా పారట్లేదు. ఇంకో నాలుగు రోజులు కరెంట్ కోతలు ఇట్లనే ఉంటే దున్నిన దుక్కి ఎండిపోయి నాటు వేసేందుకు పనికిరాదు. కరెంటోళ్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని, ఇట్లైతే పెట్టుబడి మునుగుతానని రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. 

పై నుంచి చెప్తేనే త్రీఫేజ్ కరెంట్‌‌‌‌ 

పై నుంచి వస్తున్న ఆదేశాల మేరకే వ్యవసాయ విద్యుత్‌‌‌‌ ఫీడర్లకు కరెంట్‌‌‌‌ సప్లయ్‌‌‌‌ చేస్తున్నాం. వాళ్లు త్రీఫేజ్​కరెంట్‌‌‌‌ ఎప్పుడు ఇవ్వాలో.. ఎప్పుడు బంద్‌‌‌‌ చేయాలో మాకు ఆదేశిస్తున్నరు.
‒ నాగరాజు, కాటారం ఏడీఈ, భూపాలపల్లి జిల్లా

మూడెకరాల వరి ఎండిపోతోంది

మూడెకరాల్లో వరి సాగు చేస్తున్న. ఇప్పటికే 60 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. బావుల్లో పుష్కలంగా నీరున్నా కరెంట్ కోతలతో పొలం ఎండగొట్టుకోవాల్సి వస్తోంది. పావు ఎకరం పొలం కూడా తడవకుండానే కరెంట్ పోతోంది.
–గూటం మాధవరెడ్డి, రేగొండు, భూపాలపల్లి జిల్లా